మొబైల్లో అలారం మోగుతుంటే మెలకువొచ్చింది. బద్ధకంగా కళ్ళు విప్పి పక్కకు చూశాను. రేవతి గాఢనిద్రలో ఉంది. రాజస్థాన్ టూర్లో ఉన్న మేం నిన్న పుష్కర్ క్షేత్రానికొచ్చాం. దూరంగా గుడిగంటలు వినబడుతున్నాయి. ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది. మా టూర్ ఆపరేటర్ కం డ్రైవరు శ్రావణ్ నుంచి ఫోన్. పుష్కర సరస్సుకి, బ్రహ్మదేవుని గుడికి తీసుకెళ్తానని చెప్పాడు. టైం చూశాను. ఏడు దాటుతోంది. చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఆలస్యం చేయకుండా తయారైతే మంచిదనుకుంటూ బాత్రూంకి వెళ్తూ రేవతిని నిద్ర లేపాను.మరో గంటలో తయారై పుష్కర్ సరస్సుకు చేరాం. ఆ పుణ్యసరస్సుకు ఓ ప్రశాంతతను, ఓ పవిత్రతను ఆపాదించుకున్న నాకు అక్కడికి చేరగానే ఆశాభంగమే అయ్యింది. కొంతమంది దాని ఒడ్డున పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు చేస్తున్నారు. పిండాలు వగైరా నీళ్ళలో వేసి, అక్కడే స్నానాలు చేస్తున్నారు. మరికొంతమంది పూజ పేరుతో సరస్సులోకి పువ్వులు, పసుపు కుంకుమ, రకరకాల ఆకులు, ప్లాస్టిక్ కవర్లతో సహితం విసిరేస్తున్నారు. నిర్మలంగా, స్వచ్ఛంగా ఉండవలసిన సరస్సు కలుషితమై దుర్గంధ భరితంగా ఉంది. ఆ కలుషిత జలంలోకి దిగి ఇంకొంతమంది సెల్ఫీలు దిగుతున్నారు.ఇంతలో ఒక పండా రేవతి దగ్గరకొచ్చి పుష్కర సరస్సు ప్రాశస్త్యం గురించి చెప్పడం మొదలెట్టి, ‘‘అమ్మా! ఈ పవిత్ర పుష్కరంలో మూడు మునకలేసి, ఆ గంగా మాతకు పూజ చేసుకుంటే మీ దంపతులకు అఖండ ఆయురా రోగ్యాలు సిద్ధిస్తాయి. నా మాట నమ్మండి. మీ పసుపుకుంకుమలు కలకాలం నిలుస్తాయి’’ అని హిందీలో అన్నాడు. ఆ మాటలకు రేవతి భక్తిగా ఆయనకు నమస్కరించి నావైపు చూసింది ‘చేద్దామా’ అన్నట్టు.నాకా కలుషిత జలాల్లో మునగాలంటే భయమేసింది. అందుకే, ‘‘అయ్యా! ఏమీ తినకుండా స్నానం, పూజా చేస్తే మీరన్నవి సిద్ధిస్తాయేమో గాని, ఇప్పుడే ఫలహారాలు ముగించుకున్న మేం అవి ఆచరిస్తే పుణ్యం మాట దేవుడెరుగు పాపం అంటుకుంటుంది కదా?’’ అన్నాను తప్పించుకునే ఉద్ధ్దేశంతో. నా మాటలతో ఆయన నిరుత్సాహపడి వెళ్లబోతుంటే, రేవతి ఆయన్ని పిలిచి ఓ వంద రూపాయలు చేతిలో పెట్టింది. దాంతో మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడా పండా.
********************************************