నిజమా? అంతపని చేశాడా? నమ్మబుద్ధికావడంలేదే! అంటూ ఆశ్చర్యపోయాడు ఆమె తమ్ముడు. ఆమె మరదలు కూడా ఛీ!ఛీ! ఆడలసలు కన్నోడేనా! అని చీదరించుకుంది. నీబిడ్డకేటీ బయంనేదు, నాను సూసుకుంతను, అదిక్కడే సదుంకుంటది, ఈపాలొచ్చేప్పుడు దాని స్కూలు చీటీ అట్టుకు రా అంటూ తమ్ముడు అక్కకి భరోసా ఇచ్చాడు. ఆ పిచ్చితల్లి పాపం! కాస్తంత ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ తమ్ముడు తన మాట నిలబెట్టుకున్నాడా?
****************************
పూనకం వచ్చినదానిలా ఊగిపోతూ, అలమరలోంచి షోల్డర్‌బ్యాగ్ లాగి ఎవరో తరుముకొస్తున్నట్టు కూతురు బట్టలన్నీ దాన్లో చకచకాసర్దేసింది శోభమ్మ. చేతిసంచిలో తన చీరలు రెండుకూరుకుని, మరో బ్యాగ్ తీసి తెల్లపోయి చూస్తున్న కూతురు చేతికిచ్చి ‘‘నీ పుస్తకాలన్నీ ఈ బ్యాగ్‌లో సర్దుకో, పట్టకపోతే అలమరులో పెట్టుకో...గబగబ సర్దు’’ అంది శోభమ్మ పమిట కొంగుతో చెమట అద్దుకుంటూ. ‘‘ఎందుకే అమ్మా. ఎక్కడికి పోవాల’’ అయోమయంగా అర్థంకాక అడిగింది పదమూడేళ్ల కవిత.‘‘నీవిక్కడ ఇంక ఉండకూడదు. పద మనం హైదరాబాదు పోవాలి, నీవక్కడ నీమావ ఇంటికాడ ఉండి సదూకుందుగాని... పద, తొందరగా సర్దు..’’‘‘ఎందుకుపోవాలి,నేపోను. నాదోస్తులందరూ ఇక్కడున్నారు. స్కూలు సదువు సక్కసెప్తుండారు. ఎందుకు హైదరాబాదుపోయి మావఇంటికాడుండాలి? నేపోను’’ ఏడుపుమొహంతో గట్టిగా అడిగింది కవిత.‘‘నాతల్లివిగా, సెప్పినట్టు ఇనుకో, అక్కడ ఇంకా మంచి స్కూలుంటది, మావ, అత్త సక్కగా సూసుకుంటారు. దోస్తులక్కడా అవుతారు నాలుగుదినాల్లో.
మాటాడకు సర్దు త్వరగా మనం పోదాం, పోతున్నాం..నీ మంచికే సెప్తున్నా ఇనుకో...’’ కూతురు భుజంమీద చెయ్యేసి కాస్త ప్రేమ, కాస్త కోపం చూపిస్తూ అంది పట్టుదలగా శోభమ్మ.‘‘వద్దే అమ్మా. నాకు బాగోదే అక్కడ. ఈడనే ఉంటా’’ కళ్ళనీళ్ళు తిరిగాయి కవితకి. శోభమ్మ కూతురువంక కోపంగాచూసి తనే అలమరలో పుస్తకాలన్ని బ్యాగ్‌లో కూరేసి, చెప్పులు ప్లాస్టిక్ బ్యాగ్‌లో పడేసి, వాటిని బైటపెట్టి, కూతురు చేయపట్టి బయటకు లాగి, ఇంటికి తాళం పెట్టింది. తాళం పక్కింటి అవ్వకిచ్చి ‘‘ఆడొస్తే, మా తమ్ముడింటికిబోతున్నాననిసెప్పు. ఆడి ఒళ్ళు బాగోనేదని కబురొచ్చింది’’ అని చెప్పు. ‘‘ఇదిగో వరమ్మా పిల్లదానిసంగతి ఎత్తమాకు, నేనొక్కర్తినే బోయాననిసెప్పు’’ అని చెప్పేసి, బయటకొచ్చి కనపడిన ఆటో పిలిచి ఎక్కేసింది. అదే ఊపుతో బస్టాండుకెళ్ళి, కనపడిన హైదరాబాదు బస్సెక్కేసింది పిల్లతో కలిసి.