‘‘ఏదన్నా రాస్తున్నారా రచయిత గారూ?’’ అంటూ వచ్చాడు ప్రొఫెసర్ శ్రీరామ్‌రెడ్డి, ఉదయం తొమ్మిది గంటలకే.నేను మా డ్రాయింగ్ రూంలో కూర్చొని ఆ రోజు పేపర్ చదువుతున్నాను.‘‘ఏమీ రాయడం లేదు, ఈటైమ్‌లో నేను సాధారణంగా న్యూస్‌పేపర్ చదువుతుంటాను’’ అన్నాను. శ్రీరామ్‌రెడ్డి నా ముందున్న సోఫాలో కూర్చున్నాడు.
ఎప్పుడు కాస్త టైమ్ దొరికినా శ్రీరామ్‌రెడ్డి మా ఇంటికొచ్చి కాస్సేపు కబుర్లు, ముఖ్యంగా ఆయన పనిచేస్తున్న యూనివర్సిటీకి సంబంధించిన కబుర్లు చెప్పి వెళ్తుంటాడు. ఆయనకు సాహిత్యం మీద కూడా చాలా అభిరుచి ఉంది. కథలు, కవిత్వం చదువుతుంటాడు. కవిత్వానికి సంబంధించిన సందేహాల్ని నన్ను అడిగి తెలుసుకుంటూ ఉంటాడు.వేరే విషయాలు కొన్ని మాట్లాడిన తర్వాత, ‘‘నేనొక విషయం అడుగుతాను, ఏమీ అనుకోరుగా?’’ అన్నాడు శ్రీరామ్‌రెడ్డి.‘‘అడగండి... నేనేమీ అనుకోను’’‘‘మీ రచయితలకొక వీక్నెస్ ఉంటుందని నిన్ననే మా మిత్రుడొకాయన అన్నాడు, అది నిజమేనా అని..’’‘‘ఆ వీక్నేస్ ఏమిటో చెప్పండి’’ ‘‘మీ రచయితల్లో కొందరు చాలా పలుకుబడి ఉన్నవాళ్లు ఉంటారు కదా, వాళ్ళతో ఏదన్నా పని చేయించుకోవాలంటే వాళ్ళు రచించిన పుస్తకాలను బాగా పొగిడితే వాళ్ళా పనిచేసి పెడ్తారట, నిజమేనా సార్!’’ అన్నాడతడు.
‘‘మీరన్న మాటలో కొంతనిజం లేకపోలేదు. రచయితలకు వాళ్ళు రాసిన పుస్తకాల మీద చాలా ప్రేమ ఉంటుందనడంలో సందేహం లేదు, వాటిని వాళ్ళు తమ కన్నపిల్లల్లాగే చూసుకుంటారు. కన్నపిల్లల్ని ఎవరైనా పొగిడితే అలాగే సంతోషిస్తారు. రచయితల్లోని ఈ వీక్నెస్‌ను తెలుసుకుని కొందరు గిరీశం లాంటి దుర్మార్గులు దీన్ని మిస్‌యూజ్ చేస్తారు. ఈ విషయంలో నాకు జరిగిన ఒక అనుభవమే చెబుతాను, వినండి’’.‘‘చెప్పండి సార్’’ అన్నాడతడు.‘‘నాలుగేళ్ళ క్రితం అనుకుంటాను...2014లో జనరల్ ఎలక్షన్స్ జరుగబోతున్న టైమ్‌లో ఒక పాతికేళ్ళ కుర్రాడు మా ఇంటికొచ్చాడు. చూస్తే చాలా సంస్కారవంతుడిలాగే ఉన్నాడు. మంచి అందగాడే, చాలాచక్కగా డ్రెస్ చేసుకున్నాడు. తన పేరు అభిషేక్ అనీ, ఢిల్లీ ఐఐటీలో ఎం.టెక్ చేసి ఇప్పుడు ఢిల్లీలోనే ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నానని, నెలకు లక్ష రూపాయల జీతమని, తనింకా పెళ్ళి చేసుకోలేదని చెప్పి ‘‘నేను మీ వీరాభిమానిని సార్.. మీ పుస్తకాలన్నీ చదివేశాను.
వాటిని చదువుతోంటే నా గురించే మీరు రాశారనిపించేది. మీ పుస్తకాల్లో అనుక్షణం నన్ను నేను చూసుకున్నానంటే నమ్మండి. మీ పుస్తకాలు చదివి నేనెంతో మారిపోయాను సార్! ఒకప్పుడు నాకు ఈ ప్రపంచాన్ని గురించి, ఈ మనుషుల ప్రవర్తన గురించి ఏమీ తెలిసేదికాదు. ఒకసారి నేనో అమ్మాయిని....బిటెక్‌లో నా క్లాస్‌మేట్‌ను ప్రేమించాను. ఆమె నా ప్రేమను తిరస్కరించినప్పుడు కృంగిపోయి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. సరిగ్గా ఆ రోజుల్లోనే మీ నవలలు చదివాను.
ఎవరూ ఎవర్నీ ప్రేమించరని, ప్రేమ అనేదొక భ్రమ అని, మనల్ని ఎవరో ప్రేమించాలని, మనమూ ఎవర్నో ప్రేమించాలని అనుకోవడంవల్లనే ఈ ప్రేమ అనేది యువతీ యువకుల్లో పెరిగి పోయిందని, ముఖ్యంగా ఈ సినిమాలు ప్రేమ అనే భ్రమను పెంచిపోషిస్తున్నాయని, నిజానికి ఎవరూ ఎవర్నీ ప్రేమించరనీ, ప్రేమిస్తున్నామనే భావనను ప్రేమిస్తారని, చాలామంది యువకులు సెక్స్ కోరికనే ప్రేమ అనుకుంటారని, నిజమైన ప్రేమ చాలా అరుదుగా ఎక్కడోతప్ప ఉండదని మీరు రాసిన అంశాలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ప్రేమించడం అనే భ్రమలోంచి బయటపడి చదువుమీదనే దృష్టి కేంద్రీకరించి ఐఐటీ డిల్లీలో సీటు సంపాదించాను. ఎంటెక్ ఫస్ట్‌క్లాస్‌లో ప్యాసయి మంచి ఉద్యోగం సంపాదించి నా జీవితాన్నొక దారిలో పెట్టుకున్నాను. దీనికంతటికీ మీరే కారణం సార్. మిమ్మల్ని నేను ప్రతిరోజు నా మనసులోనే పూజించుకుంటాను సార్!’’