రెండు పేజీల పరిశీలనా పత్రాన్ని నింపి సంతకం దగ్గర ఆగిపోయాడు రిటర్నింగ్ ఆఫీసర్ పాండురంగం. ఎందుకో చేతులు వణుకుతున్నాయి. పైన ఫ్యాన్ తిరుగుతోంది. అయినా నుదుట చెమట పట్టింది. మనసులో ఎక్కడో సలపరింత. పక్కకు తిరిగి చూశాడు. బాలమల్లు వేలి ముద్ర వేసిచ్చిన కాగితం కనిపించింది.
ఒక్క సంతకం చేస్తే చేతిలోని పరిశీలనా పత్రం అంతా నిజమే అని చెప్పే ఒక తిరుగులేని శాసనం. కాదని ఒక్క కాంప్లెంట్ రాస్తే బాలమల్లు ఇచ్చిన కాగితం అంతా అబద్ధమని చెప్పే ఒక తిరుగులేని సాక్ష్యం.ఏం చెయ్యాలని ఆలోచిస్తూ బయటకు వచ్చాడు. అది చూసి ‘‘సార్.. ఏమన్న తెమ్మంటరా’’ అంటూ పరిగెత్తుకు వచ్చాడు అటెండర్. ‘టీ తీసుకరమ్మ’ని చెప్పి, వచ్చి కుర్చీలో కూర్చుని కళ్లు మూసుకున్నాడు. పొద్దున తాను నిజ నిర్ధారణ కోసం వెళ్లిన బొంగుల కింది తండా కళ్లముందు కదిలింది.అది పేరుకే తండా కాని, ఎనిమిది వార్డులు, ఆరు వందల ఎనభై నాలుగు ఓట్లున్న చిన్న ఊరు. మండల కేంద్రానికి దూరంగా గుట్టల మధ్య ఉంది. ఊరికి వెళ్లేసరికి కరకర పొద్దు పొడుస్తోంది. అప్పటికే చాలామంది పంచాయతి ఆఫీసు వద్ద జమ కూడి ఉన్నారు. కారు దిగగానే లోపలికి ఆహ్వానించారు.
పాండురంగం అందరినీ ఓసారి చూసి ‘‘సరే... మీరు సర్పంచ్‌ను వార్డు మెంబర్లను ఏకగ్రీవం చేసుకున్నరుగదా. మీకు మీరే చేసుకున్నరా లేక ఎవలన్న భయ పెట్టిండ్రా.. ఏదున్నా ఇప్పుడే చెప్పుండ్రి’’ అన్నాడు.అందరూ ‘మాకు మేమేచేసుకున్న’మన్నారు. మరోసారి అడిగినా అదే సమాధానం. అప్పుడే జనంలోంచి ఎవరో ‘‘అగో.. భగవంతం బాపు వత్తండు’’ అన్నారు. పక్కకు జరిగి తొవ్వ ఇచ్చారు.తెల్లగా ఎత్తుగా ఉన్న ఓ ముప్పయేండ్ల వ్యక్తి నలగని ఖద్దరు బట్టల్లో అందరినీ ‘అన్నా.. తమ్మీ’ అని పలకరిస్తూ వచ్చి కుర్చీ జరుపుకుని కూర్చుంటూ ‘‘అనుమానమే లేదు సార్... మాకు పదవులకంటే ఊరు బాగు ముఖ్యం’’ అంటూ నాలుగు పేజీలనిండా సంతకాలున్న కాగితాలను అందించాడు. ఏకగ్రీవానికి అనుకూలంగా ఊరంతా కలిసి చేసిన తీర్మానం అది. వారి మాటలు నమ్మక ఊరంత తిరిగి అందరినీ అడిగాడు పాండురంగం. ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదు. అందరిదీ ఒకే మాట. పని ముగించుకుని కారులో బయలుదేరాడు.