సావిత్రమ్మ కచ్ఛాపోసి చీరకట్టి, పైటచెంగు పైన కప్పుకుని శంకరానికి ఎదురుగా శకునం వచ్చింది. గత మూడుసంవత్సరాలుగా ఆమె అలా కొడుక్కి ఎదురొస్తూనేవుంది. అలా తెగ తిరగడం మూలంగా చాలామందికి చెప్పులు అరుగుతాయి. అవిలేని కొందరికి కాళ్ళు అరుగుతాయి. శంకరానికి మాత్రం మోకాళ్ళు, అరచేతులు అరుగుతున్నాయి. కారణం శంకరానికి చిన్నప్పుడు పోలియోవచ్చి రెండు కాళ్ళూ చచ్చుబడిపోయాయి. తల్లిదండ్రుల అమాయకత్వం, అజ్ఞానం శంకరం జీవితానికి శాపంగా మారింది. సన్నగా పీలగా ఉండేకాళ్ళమీద భౌతికంగా నిలబడే అవకాశం లేదు. ఐనా తండ్రికి భారం కాకుండా తన కాళ్ళమీద తను ఆర్థికంగా నిలబడాలని శంకరం ఆశ. అందుకే తండ్రితోపాటు గుడికివెళ్ళి అర్చకత్వం చేస్తున్నాడు.

అంగవైకల్యం ఉన్నా అది శంకరం చదువుకు ఏనాడూ అడ్డంకి కాలేదు. అంగవైకల్యాన్ని కొందరు ఆకతాయి పిల్లలు ‘కుంటాడు’ అని ఎగతాళి చేసినా, అది అతనిలో కసినే పెంచింది. తోటిపిల్లల్లా ఫుట్‌బాల్‌, క్రికెట్‌ ఆడలేకపోయినా, ఆ ఆటల్ని టీవీలో చూసినా శంకరం మనస్సు మూగగా రోదించేంది. భగవంతుడు తనకే ఎందుకు ఈ శిక్ష విధిండాడో అర్థమయ్యేదికాదు. స్కూల్లో డ్రిల్లు పీరియడ్‌లో అంతా ఆటలాడుతుంటే శంకరం మౌనంగా క్లాసురూంలో కూర్చుని ఆ రోజుచెప్పిన పాఠాలు చదివి ఒంటబట్టించుకునేవాడు. టెన్త్‌క్లాస్‌లో జిల్లా ఫస్ట్‌ వచ్చినందుకు స్కూల్లో ప్రత్యేక బహుమతి ఇచ్చినప్పుడూ, ప్రతిభా రివార్డ్‌ తీసుకునేటప్పుడూ తనకు తానుగా స్టేజ్‌ ఎక్కలేకపోయాడు. తండ్రి రామశాస్త్రి ఎత్తుకుని స్టేజీమీదకు ఎక్కించాడు. ఆ క్షణంలో తండ్రికళ్ళలో కనిపించిన నీళ్ళు ఆనందబాష్పాలో, తన స్థితికి దుఃఖాశ్రువులో శంకరానికి అర్థం కాలేదు.