గోదావరి గట్టు, ఆ గట్టు నానుకొని ఒక వీథి. ఆ వీథిలో ఒక చిన్న పెంకుటిల్లు. ఆ యింట్లో వర్ధనమ్మ అనే ఒక బామ్మగారు. ఆ బామ్మగారికి భాస్కరం అనే వారసుడు, ఆ వారసుడికి కమల అనే ఇల్లాలు.నాలుగురోజుల ముసురు తర్వాత తొలిపొద్దువేళ,వర్ధనమ్మగోరూ! వర్ధనమ్మగోరూ! ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే ఎవరిదో పిలుపు.

‘‘మీ బామ్మగారినెవరో పిలుస్తున్నట్టున్నారు’’ అంటూ భర్తను లేపింది కమల.‘‘అబ్బా! నువ్వే లేపవే’’ ఒళ్ళు విరుచుకొని ముసుగు మరింత బిగించాడు భాస్కరం.‘‘పరగడుపునే బోడి మొహం ఎలా చూడనండీ. మీరే లేపండీ’’.పెంచి పెద్దచేసి ఓ ఇంటివాడిని చేసిన తన బామ్మను నిన్నగాకమొన్నొచ్చిన ఇల్లాలు బోడి మొహం అన్నందుకు మనస్సు చివుక్కుమంది భాస్కరానికి.‘‘వర్ధనమ్మగోరూ! వర్ధనమ్మగోరూ!’’‘‘ఎవరు వారూ’’ అంటూ వర్ధనమ్మే పలికింది ఈసారి. తన స్థూలకాయాన్ని అదుపులోకి తెచ్చుకుని కిటికీకేసి జరిగి చిడతను తప్పించి కిటికీ రెక్కను మెల్లిగా సగం తెరిచింది వర్ధనమ్మ.కిటికీకి అడ్డు నిలిచి ‘‘మామ్మగోరూ’’ అంటూ మళ్ళీ పిలిచాడు సత్తిగాడు.‘‘ఓరి నువ్వట్రా సత్తిగా’’‘‘అదేంటి మామ్మగోరూ ఇంకా తొంగున్నారు.

లెగండి గోదారి పొంగేసినాది. వడి మంచి పోటుగా ఉంది’’.‘‘అలాగట్రా. అడ్డులే. ఏదీ చూడనీ’’ అంటూ కిటికీ రెక్కల్ని భళ్ళున తెరచింది.గోదావరి నురగలతో గలగలమంటూ పరవళ్ళు తొక్కుతోంది. దూరాన్నించి ఆనకట్ట హోరుకు సాయం గాలి హోరు తోడై చెవులు గింగిర్లెత్తిస్తున్నాయి. గోదావరి అంచున దూరంగా ఉదయసూర్యుని తొలికిరణాలు కాంతిని పుంజుకుంటున్నాయి. వర్ధనమ్మ కళ్ళు మెరిశాయి.‘‘ఒరే పుల్లలేమైనా కొట్టుకొచ్చాయిరా గోదాట్లో’’‘‘అందుకే కదమ్మా నేనొచ్చింది. జాలరిపేట జనమంతా తెప్పలుచ్చుకుని ఏట్లోకి దూకేశారు. సుక్కపొడవకుండా ఆరు నేరేడు దుంగల్ని, మూడు మద్ది దూలాల్ని అంకాలమ్మ రేవుకాడికి సేరేశారు. తుమ్మమోళ్ళ సంగతి సెప్పనేక్కర్లేదు. బొడ్డూడని కుర్రనాయాళ్ళు సైతం కర్రకి డొంకిణీ కట్టి లాగేత్తున్నారు’’.