నాతోపాటు ముగియబోతున్న రెండో ప్రపంచయుద్ధంలో ఒలికిన మొత్తం నెత్తురంతా నా పరాజయభారంతో కలిపి చిక్కబడి, అక్కడికే ప్రవహించినట్టు బరువెక్కిన నా కుడి చేతి చూపుడు వేలు ట్రిగ్గర్‌పై బిగిసింది.పిస్టల్ పేలిన చప్పుడు ...
యుద్ధంలో విస్ఫోటించిన బాంబులన్నింటి శబ్దం కన్నా కఠోరంగా ఉంది. నిజం చెప్పాలంటే, ఆ బాంబుల శబ్దం కటువుగా కాక ‘హెయిల్ హిట్లర్!’ అంటూ ప్రపంచమంతా నాకు ఉచ్ఛశ్రుతిలో జేజేలు పలుకుతున్నట్టుండేది.బంకర్లోని సోఫాలో పడివున్న నా కుడి కణత నుంచి నెత్తురు ఉబుకుతూ చెక్కిలి మీదుగా పారి, మీసాలనూ, పెదవులనూ తడుపుతోంది. నా ముఖం బాల్యంలో విన్న కథల్లోని నరమాంసం తినే రాక్షసుడి ముఖంలా నన్నే భయపెడుతోంది.చిన్నప్పుడు బాణంలా పరిగెడుతూ తూలిపడ్డప్పుడు కూడా అదేచోట దెబ్బ తగిలి, అలాగే రక్తం ధార కట్టింది.కొంచెం వెనకే వస్తున్న అమ్మ ఉరుక్కుంటూ వచ్చి ‘‘అయ్యో, నాయనా .. అడ్డీ!’’ అంటూ ఒక్క ఉదుటున నన్ను లేపి, గుండెలకు హత్తుకుంది. చిరుగాలి మొగ్గను నిమిరినంత మృదువుగా తన గౌను అంచుతో నా నెత్తురు తుడిచింది.
ఇప్పుడు కూడా అప్పటిలాగే బాధగా ఉన్నా అక్కున చేర్చుకునేదెవరు?!అవునూ.. యుద్ధంలో ఎన్నికోట్ల మంది ఆర్య, ఆర్యేతర తల్లుల చెక్కిళ్ళు కన్నీటి జలపాతాలయ్యాయో? వెచ్చటి, ఉప్పటి ఆ అశ్రురాశి ముందు బహుశా బాల్టిక్ సముద్రమే చిన్నబోతుందేమో! యుద్ధంలో చనిపోయిన వారి కళేబరాలన్నింటినీ పేర్చితే ఎన్ని ఆల్ప్స్ పర్వతాలవుతాయో! ఆర్యులదైనా, ఆర్యేతరులదైనా కన్నీటి వన్నె ఒక్కటేగా! దేవుడు ఆర్యులకు, ఆర్యేతరులకూ ఒకే ప్రాణవాయువును సృష్టించాడు కదా! నేనే గనక ఆజ్ఞాపించి ఉంటే ఆ గోబెల్స్ జాతికో ప్రాణవాయువు ఉండి తీరుతుంది అని కూడా ప్రచారం చేసి ఉండేవాడేమో!హే ప్రభూ! నేను పడి ఉన్న అదే సోఫాలో నా పక్కనే ఈవా.. !డేగతో చెలిమి నేరానికి వేటగాడి వేటుపడ్డ పింటరెస్ట్ పిట్టలా! మూతపడ్డ ఆమె కనురెప్పలు మేమిద్దరం చవి చూసిన సుఖవిలాసాలకు దించిన తెరల్లా ఉన్నాయి. నేను కట్టించిన ఈ బంకర్ గోడలపై నా నెత్తురే చిమ్ముతుందని కలలోనైనా అనుకున్నానా!