‘‘డియర్ హబ్బీ!నిన్ను ‘నెలరాజు’ అని పిలవాలనిపిస్తుందోయ్.ఎందుకంటావా? ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ లాగా ఆ ఊళ్ళో నువ్వు – ఈ ఊళ్ళో నేను ఒకరి ఊహల్లో ఒకరం గడిపేస్తూ, ఉద్యోగాలు చేసేస్తూ నెలకోసారి కలుసుకోవడం, కలిసున్న ఆ రెండురోజులూ ఎండలోపెట్టిన మంచుముక్కల్లా రెండుక్షణల్లో కరిగిపోవడం..మళ్లీ ఎదురుచూపులు, నిరీక్షణ, నువ్వు వస్తావని!
ఎవరో అన్నట్టు నిరీక్షణ నీకు సుఖంగా ఓ ‘వరం’లా ఉందేమో! నాకు మాత్రం అది ఓ ‘శిక్ష’లా, ‘శాపం’లా అనిపిస్తోంది. ఆకాశం రాత్రికాగానే, నక్షత్రాల డిజైన్లున్న నల్లచీర కట్టుకుని, జడలో జాబిల్లిని తురుముకుని, అందంగా ముస్తాబై వస్తుంది. బాల్కనీలో పిచ్చిదానిలా కూర్చున్న నన్నుచూసి నవ్వుతున్నట్టు, మల్లెపందిరి మీదనుంచి వీస్తోన్న చల్లగాలి నా తనువును తాకి వేడిపుట్టిస్తున్నట్టు, గంటలు కొడుతున్న గోడగడియారం క్షణాలను యుగాలుగా మారుస్తున్నట్టు...మనసంతా ఒకటే ‘కలవరం’!మొదట్లో, అంటే పెళ్ళి చూపుల్లో నిన్ను చూసినప్పుడే, ‘వస్తాడు నా రాజు ఈరోజు...’ అనే పాటను నా హృదయ వీణపై శ్రుతిచేసుకున్నాను.
మొదటిరాత్రి నీ కౌగిట్లో ఒదిగినప్పుడు కల‘వరం’ అయినట్టుగా... ఇలకు స్వర్గం దిగి వచ్చినట్టుగా అనుభూతి చెంది, ‘ఈ ఆనందం నా సొంతం, ఇది అంతే తెలియని అనంతం’ అని ఆనందపడ్డాను.కానీ,‘‘ఈ రోజుల్లో సుఖంగా బతకాలంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయాల్సిందే! నువ్వు ఉద్యోగం మాననని మాటివ్వు! ఏదైనా రికమెండేషన్‌పెట్టి నిన్ను నా దగ్గరకు రప్పించడమో. నేనే నీ దగ్గరకు రావడమో చేస్తాను. అందాక వారానికోసారి, నెలకోసారి మనం కలుద్దాం! కాదనవు కదూ...’’ అని నువ్వంటున్నప్పుడు నా గుండె తన చప్పుడుకు దూరమవుతున్న ఫీలింగ్ కలిగింది. మనసులోని బాధ మొత్తం కన్నీటి రూపంలో బయటకు వచ్చి, అన్నాళ్ళ నా కలలన్నింటినీ కరిగించేసింది. ఇవ్వాళ్టి ట్రెండ్ ప్రకారం సుఖంగా బ్రతకాలంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయాల్సిందే. కాదనను! కానీ ఇలా, మనలా ఎవ్వరూ ఉండకూడదు! ఎందుకంటే మనం కలిసి కాకుండా విడివిడిగా బతుకుతున్నాం. ఇందులో ‘సుఖం’ ఎక్కడుంది?