ఒక్క కూతురు చాలనుకున్నారు. అడిగినవన్నీ కాదనకుండా తెచ్చిచ్చారు. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలపై ఆ కూతురు నీళ్లు చల్లింది. ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది.. ‘నీవు ప్రేమించానని చెబుతున్న వ్యక్తి గురించి మేం ఆరా తీశాం. ప్రవర్తన మంచిది కాదు.. ప్రేమను మర్చిపోయి.. ఉద్యోగం తెచ్చుకో..’ అని తల్లిదండ్రులు చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టిన ఆ కుమార్తె పరిస్థితి చివరకు ఇలా.. అసలేం జరిగిందంటే..
****************************
ప్రజ్ఞజీవితంలో నేను మొట్టమొదటిసారి, ‘మరణించాలి’ అనుకున్నాను.ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి రహస్యంగా నేను తాళి కట్టించుకున్న ఆర్య, మా పెళ్ళైన ఆరునెలల తరువాత తనలోని అపరిచితుడిని నాకు పరిచయం చేశాడు. హీనంగా చూడటంమొదలెట్టాడు. అదేమని ప్రశ్నిస్తే, ‘‘పెట్టింది తిని, పడి ఉండు’’ అని పొగరుగా జవాబు ఇచ్చాడు. ‘నా ప్రేమ బలమైనది’ అనుకున్నాను. కాని అది నా బలహీనతతో ఆర్య ఆడుకున్న గేమ్ అని అర్థమైంది. జరగవలసిన ఘోరం జరిగిపోయింది. ప్రేమ విఫలం ఎంత గాయం చేస్తుందో!
అమ్మ, నాన్న నన్ను అరచేతుల్లో పెట్టుకుని, నాకు కష్టం తెలియకుండా, నేను కంటనీరు పెట్టకుండా పెంచారు. చిన్నప్పుడు, ‘‘నా బుక్ అపర్ణ దొంగిలించింది’’ అని చెప్పినప్పుడు అమ్మ అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ‘‘నువ్వు చూశావా?’’ అని. ‘‘లేదు, సంజన చెప్పింది’’ అన్నాను.అప్పుడు అమ్మ ఒక్కక్షణం నా కళ్ళల్లోకి తీక్షణంగా చూసి, ‘‘చూడు, ఇతరులు చెప్పిన దానిని నమ్మకు, నువ్వు చూసినదే నమ్ము’’ అంది. అమ్మ చెప్పిన ఆ మాట నా మనసులో ముద్రించుకుపోయింది. అందుకే ఆర్య విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మలేదు.ఎందుకంటే ఎవరు చెప్పినదీ నేను నా కళ్ళతో చూడలేదు కనుక. కేవలం ప్రేమకోసం కాలేజ్ ముందు, ప్రొద్దుటనుండీ సాయంత్రందాకా ఎండలో ఒంటికాలిమీద నిలబడిన ఆర్యను చూసి మనసు పారేసుకోని ఆడపిల్ల ఉంటుందా! ఆర్య ప్రదర్శించిన డాబూ, దర్పం, అతడి కమ్మనికబుర్లు నన్ను ఆకర్షించాయి.నేను నా కళ్ళతో చూసిందే నమ్మాలని పెట్టుకున్న నిర్ణయానికి తగ్గట్టుగా నేను చూడతగ్గదే ఆర్య నాకు చూపించాడు. మా స్నేహంలో తనలోని అపరిచితుడిని నాకు ఎప్పుడూ పరిచయం చెయ్యలేదు.