‘‘మామా, ముదిరిపోయిన బెండకాయనీ, నీ ముద్దుల మేనల్లుణ్ణీ, మీదుమిక్కిలి నీవు తక్క పెద్ద దిక్కులేని అభాగ్యుణ్ణీ నేను. దయతలచి నువ్వే నన్నో ఇంటివాణ్ణి చెయ్యాలి’’ భక్తప్రహ్లాదుడు ఇనుప స్తంభాన్ని కౌగలించుకున్నట్లు మేనమామ వెంకటాచలం కాళ్లను గట్టిగా వాటేసుకున్నాడు చిట్టిబాబు.‘‘వదల్రాబాబూ, అసలే హైబీపీ మనిషిని. పైపెచ్చు ఈ మధ్య షుగర్ లెవల్స్ కూడా ఎక్కువై మాటిమాటికీ కళ్ళు తిరిగి పడిపోతున్నాను. అంత గట్టిగా నువ్వు నా కాళ్లు పట్టి గుంజితే కిందబడి మోకాళ్లు కూడా విరగొట్టుకోవాల్సివస్తుంది’’ మేనల్లుడి భల్లూకపు పట్టుకు జడిసిపోయి మొత్తుకున్నాడు వెంకటాచలం మామ.
‘‘నాగవల్లితో నా పెళ్ళి కుదిర్చిపెడతానంటేనే నీ కాళ్లు వదిలేది. లేదూ ఈ రాత్రంతా ఇలానే ఉండిపోతాను’’ బావురుమన్నాడు చిట్టిబాబు.‘‘నాగవల్లా? అదేంపేర్రా!ఎన్నాళ్లకెన్నాళ్లకీ! నీకు కల్యాణఘడియలు దాపురిస్తున్నాయంటే ఆఘమేఘాలమీద వెళ్ళి ఆ పెళ్ళి కుదిర్చేయనూ! ముందు నీ ఉడుంపట్టు వదిలి, స్ట్రాంగ్ కాఫీ తెప్పించి, ఆ పైన అసలు విషయం చెప్పిఏడువ్’’ తాపీగా సెలవిచ్చారు వెంకటాచలం ఏడవలేక నవ్వుతూ.చిట్టిబాబు పైకిలేచి, రూం కిటికీ లోంచి టీ కొట్టు నాయర్ని కేకేసి రెండు స్ట్రాంగ్ కాఫీ తీసుకురమ్మన్నాడు.
మనసులోని గోడు మేనమామ ముందు వెళ్లబోసుకున్నాడు.పీజీతో చదువుకు ఫుల్స్టాప్ పెట్టేశాక, ఎం.ఫిల్ అనీ, పి.హెచ్.డీ అనీ మరో ఆరేళ్లు వేస్టుగా గడిపేసి, బట్టతల నెత్తిమీదకొచ్చి, బానపొట్ట మొదలయ్యాక తాపీగా ఉద్యోగాలు వెతుక్కున్నాడు చిట్టిబాబు. అలా ఉద్యోగాన్వేషణలో మరో రెండేళ్ళు గడిపాక అతనికి ఓ పల్లెటూరి బ్యాంకులో గుమస్తా ఉద్యోగం దొరికింది. వయసు మీరడంవల్లా, బట్టతలవల్లా ముదురుగా కనిపిస్తూ ఉండడంతో అతనికి చాలా సంబంధాలు తప్పిపోయాయి.