పెళ్ళి గాజులు, పేరంటం గాజులు, చిన్న పిల్లల గాజులు, సీమంతం గాజులు.. లక్కవీ, మట్టివీ, రబ్బరువీ...ఒకటా? రెండా? బసప్ప విజాపుర కుటుంబం ఎన్నిరకాల గాజులు అమ్మిందో! ఊళ్లూ, రాష్ట్రాలూ మారి ఎన్నెన్ని కష్టాలు పడిందో! ‘గాజుల బేరం భోజనానికి సరి’ అని సామెత! ఎన్ని గాజులమ్మినా పూటగడవకపోవడం ఆ కుటుంబం తలరాత!భార్య, భర్త, నలుగురు పిల్లలు- మొత్తం ఆరుగురు తలదాచుకోవాలంటే ఎన్ని గదులు కావాలి?ఒక్కగది చాలనుకున్నాడు బసప్ప విజాపుర.ఒంటిగది ఇంటికోసం పార్వతీపురంలోని బెలగాం ప్రాంతమంతా వెతికాడు. చివరికి అగ్రహారంవీధిలో చవగ్గా దొరికింది. అది బోడపాటి రమాపతిగారి ఇంటికీ, వెంకోబరావు డాక్టర్‌గారి ఇంటికీమధ్య పాడుబడ్డ ఆవరణలో ఉండేది. అక్కడి జనందాన్ని ‘భూత్ బంగ్లా’ అనేవాళ్ళు.ఏపుగా ఎదిగిన తుమ్మ, రేగుతుప్పలు, ఏ మూలచూసినా జిల్లేడు మొక్కలే. పురుగూపుట్రా తిరిగేప్రదేశం. ముందు ఖాళీభాగంలో పాత ఇల్లు కూలిపోయి, పునాదులు పైకి లేచి, వృద్ధాప్యంలో పెల్లుబికిన నరాల్లా కనిపించేవి. వెనకభాగంలో, మేడమీద ఒకేఒక్క గది! రోడ్డుమీంచి చూస్తే జగన్నాథస్వామి రథంలాగా కనిపించినా, పైకి వెళ్తే మాత్రం ఎండిపోయిన మానుమీద బక్కచిక్కిన కొంగలాగా అనిపించేది.

పెంకులమధ్య సందుల్లోంచి ఎండ పొడుగాటి గొట్టంలా ఏటవాలుగా దిగేది. వానాకాలంలో ఒలిపిరికి గోడలు చారలుకట్టి అక్కడక్కడ పెచ్చులు రాలిపోయాయి. గోడకన్నాల్లో బిలబిలమంటూ నల్లుల పటాలాలు...చూరుపట్టుకు వేలాడుతూ సాలీళ్ళు! వీధిలో విద్యుత్ స్తంభాలు ఉన్నాయిగానీ ఇంట్లో మాత్రం కరెంటు లేదు. నీళ్ళకోసం బంగ్లావెనక నూతికి వెళ్ళాలి. మొండిగోడల వెనక కాలకృత్యాలు తీర్చుకుని, నూతిచప్టా మీద చాటుగా స్నానాలు చెయ్యాలి.‘‘ఇది ఇల్లా? ఇక్కడ ఆరుగురితో బతకాలా?’’ అని బసప్ప ఆలోచించాడో లేదోగానీ ‘తలదాచుకోడానికి చవగ్గా నీడ మాత్రం దొరికింది, అదే చాలు అనుకున్నాడు’. ఓ సాయంత్రం విజయనగరంలో విశాఖపట్నం- దుర్గ్ ప్యాసింజర్ ఎక్కి పార్వతీపురంలోని బెలగాంస్టేషన్లో సంసారంతోపాటు దిగిపోయాడు. రిక్షాఖర్చు మిగల్చాలని ఇంటికీ, స్టేషన్‌కీ మధ్య సుమారు కిలోమీటరున్నర దూరం బసప్ప, భార్య, ఇద్దరు పెద్ద పిల్లలూ సామాన్లు మోసుకొచ్చారు. బెలగాంసెంటర్లో కాటూరు సోములు దుకాణం దగ్గర కుడుం ముక్కలుతిని, టీ నీళ్ళు తాగారు. భూత్ బంగ్లా మేడమీద గదిలో బుడ్డీదీపం వెలిగించి, పెచ్చులూడిన గచ్చుమీద ఎక్కడ సామాన్లు అక్కడే పడేసి, తుంగచాపలమీద కూలబడ్డారు. ఒకవైపు బొగ్గుల కుంపటి, మరోవైపు రెండు చెక్కపెట్టెల్లో బట్టలు, పాతలు, వంటపాత్రలు, తత్తిమా సామాన్లు. ఇంకోవైపు గాజుల బస్తాలు! వాటిమధ్య చంద్రుడిలో ఒదిగిపోయిన కుందేటికూన లాగా ఆ రాత్రికి సర్డుకుపోయిన కుటుంబం అనేక రాత్రులు అలవాటుగా సర్దుకుపోతూ వచ్చింది. నిట్టూర్పులతో రోజులు నెట్టుకొచ్చింది.