రాత్రి తొమ్మిది దాటింది. అరగంటనుంచీ వీధి గుమ్మం దగ్గర నిలబడి వచ్చేపోయేవారిని ఆశగా చూస్తోంది సీత. ‘రాముడు రాడా, నన్ను రక్షించడా’ అనే ఆశతో ఎదురుచూసే అశోకవనంలో సీతకాదు ఈ సీత! ‘నాకోసం ఏ రాముడు రానక్కరలేదు, రావణుడైనా చాలు, మగాడైతే చాలు. నాలుగు డబ్బులిచ్చేవాడైతే చాలు’ అన్నట్టు, గుమ్మం ముందు ఎవరైనా కనపడితే, ఓ నవ్వు విసిరి నాలుగు అడుగులు ముందుకేసి ఆ శాల్తి ముందుకెళ్లగానే మొహంలో నవ్వు మాయమయ్యేది. మొహం మొటమొటలాడించుకుంటూ, ‘‘ఈ దొంగనాయాళ్ళందరూ పెళ్ళాలకొంగట్టుకుతిరిగే పిరికినాయాళ్ళైపోతున్నారు. ఎదవలు తాగి, తాగి గుట్కాలు మింగి మింగి కొజ్జా వెధవలైపోతన్నారు’’ ఆమె నోట్లోంచి బూతుమాట. ఆకలికి ఎన్ని బూతులైనా వస్తాయి మరి.
అప్పటికి అరగంటముందు బియ్యం డబ్బా పీకి, లాగినా, దులిపినా గుప్పెడు గింజలు కూడా రాలేదు. ఆ ఉన్న గింజల్నే మూడు నాలుగు గ్లాసులు నీళ్ళుపోసి గంజిలా తయారుచేసి ఇంత ఉప్పేసి, చదువుకుంటున్న కూతురిని పిలిచింది.‘‘ఇవాళన్నా అన్నం వండ లేదా అమ్మా, రొట్టెన్నా చెయ్యరాదా’’ కంచం చూసి గునుస్తూ అంది రేణుక. ఉల్లిపాయ సగం కోసి సగంముక్క కూతురు కంచం ముందుపెట్టి, ‘‘ఆఁ బిరియాని వండి పెడతా. రా., ముందు ఇది తాగు, వేడిగా ఉంది. రేపు యిదీ ఉంటుందో లేదో,’’ హేళనగా నవ్వి తను కంచం ఎత్తి గంజి తాగడం మొదలుపెట్టింది. తల్లిని మింగేసేట్టుచూసి, గబగబ గంజితాగి విసురుగా లేచి వెళ్లిపోయింది కూతురు. కంచాలు, గిన్నెలు కడిగి, వంటిల్లనబడే ఆరడుగుల గదిని తడిగుడ్డతో తుడిచి, పెరటిగుమ్మం ముందు పెట్టిన బాల్చిలో నీళ్ళతో పళ్ళుతోమి పుక్కిలించింది.
తొడుక్కున్న నైట్‌గౌను తీసి గుమ్మంమీద వేసి రెండు చెంబులు నీళ్ళు పోసుకుంది. కాగితం ముక్కలోచుట్టి చూరులో దాచిన సబ్బు ముక్కతీసి ఒళ్ళు రుద్దుకుంది. దండెంమీద వేలాడుతున్న పరికిణి కట్టుకుని, తువ్వాలు కప్పుకుని, ముందుగదిలోకి వచ్చి, మూలనున్న చాప, దిండు దుప్పటి తీసికెళ్లి వంటింట్లో వేసి ‘‘పో, పోయిపడుకో, చదివింది చాల్లే...’’ అంది. పదేళ్ల రేణుక తల్లివంక తిరస్కారంగా చూసింది. రోజూ అలవాటైన తంతే గనక, మాట్లాడకుండా పుస్తకాలు పెట్టెమీద పెట్టి వంటింట్లోకి పోయింది. ఇవతలినించి గడియపెట్టి, పరుపుకింద పెట్టిన తెల్లచీర, గులాబీపూలున్న తెల్ల నైలానుచీర, తెల్ల జాకెట్టు తొడుక్కుని, చిన్నపౌడరు డబ్బాలో పౌడరు కాస్త వంపుకుని మొహానికి, మెడకి పాముకుంది. కాస్త పౌడరు జాకెట్లో జల్లుకుంది. అద్దం వెనక దాచిన, అరిగిపోయిన లిప్‌స్టిక్ తీసి వేలితో పెదాలకి పాముకుంది.
జుత్తు దువ్వుకుని క్లిప్ పెట్టి అద్దంలో ఇటు తిరిగి వయ్యారంగా చూసుకుంది. పరుపుమీద దుప్పటి తీసి దులిపి వేసింది. తలగడలు సర్ది బయట గుమ్మం దగ్గరకొచ్చి నిలబడింది. ఆఖరికి నిరీక్షణ ఫలించినట్టు, ఓ స్కూటరు నెమ్మదిగా వచ్చింది. ఎవరికోసమో చూస్తున్నట్టు అటూ ఇటూ చూస్తున్నాడు ఆ వ్యక్తి. స్కూటరు గుమ్మం దగ్గరకి రాగానే అరసెకను ఆగినట్టు కనపడింది. ఓ నవ్వు విసిరింది సీత. స్కూటరు కదిలి ముందుకు వెళ్లింది. ఆమె మొహం వాడిపోయింది. నాలుగడుగులు ముందుకెళ్ళిన స్కూటరు మళ్ళీ వెనక్కి వచ్చింది. సీత సంబరంగా అతడికి ఎదురెళ్ళి ‘‘రండి.. రండి... లోపలికి రండి’’ అంది.