ఓం హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్త్రజాంచంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవఃతాం మ ఆవః జాతవేదో....

నానోట్లోంచి శ్రీసూక్తం ఒక ప్రవాహంలా బయటకు వస్తోంది. నేను చెప్పడం ఆపగానే నా ఎదురుగా కూర్చున్న పాతికమంది పిల్లలు దాన్ని అలాగే ఉచ్ఛరిస్తున్నారు.అది ఏటిగట్టు...కార్తీకం...అందునా ప్రత్యూష వేళ కావడంతో తీరం వెంబడి చలిగాలులు వీస్తున్నాయి. ప్రతీరోజూ ఈ సమయంలో పిల్లలకి వేదపారాయణం చేయించడం నా నిత్యకృత్యం. వేద పఠనానికి, సంగీత సాధనకి నదీతీరం ప్రశస్తి అని పెద్దలు చెబుతారు.

నేను బియస్సీ పూర్తైన తర్వాత ఆలస్యంగా ఈ వేదం నేర్చుకున్నాను.మాదో చిన్న అగ్రహారం. అందులో చాలామంది వ్యవసాయంమీద ఆధారపడే పేదవారు. మా కుటుంబం పౌరోహిత్య కుటుంబం. ఇది మా తాత ముత్తాతలనుంచీ వస్తున్న వృత్తి అని మా తాతగారు చెబుతూ ఉండేవారు. తాతగారి తదనంతరం మా నాన్న, పెదనాన్నలు ఆ వృత్తి స్వీకరిస్తే, చిన్నాన్న మాత్రం వ్యవసాయం చేసేవాడు. మా ఊరి పౌరోహిత్యం నాన్నగారు చూస్తే, పక్కనే ఉన్న రెండూళ్ళలో పౌరోహిత్యం పెదనాన్న చూస్తూ ఉండేవారు. గ్రామ పౌరోహిత్యం అంటే కత్తిమీద సాములాంటిది. స్వేచ్ఛ ఉండదు. ఎక్కడికి వెళ్ళాలన్నా మన ఇష్టం కాదు.

ప్రతీరోజూ వ్రతమనో, ముహూర్తమనో రైతులు వస్తూనే ఉంటారు. వారి ఇళ్ళల్లో ఏ శుభకార్యం జరిగినా వెళ్ళాలి. లేకపోతే ఊరుకోరు. ముఖ్యంగా కార్తీకమాసంలో ఎక్కువగా అభిషేకాలు ఉంటాయి. అలాగే శివరాత్రికి కూడా. ఆ తరువాత ఏకాదశి వ్రతాలు. అప్పుడు ప్రతీఇంట్లో వ్రతాలు ఉంటాయి. అటువంటప్పుడు ఎంతో ఇబ్బంది. అందరూ ఉదయాన్నే రావాలంటారు. ఉన్నది నాన్నగారు, మరో ముగ్గురు కుర్రవాళ్ళు. బాగా ఇబ్బంది అయ్యేది. అప్పుడు నేను కూడా వ్రతాలు చేయించడానికి వెళ్ళేవాడిని.