అతడో సైనికుడు. లక్షలాదిమంది హాజరయ్యే సాగర్‌మేళాలో రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడా సైనికుడు. తప్పిపోయిన ఒక వృద్ధురాలు తారసపడిందతనికి. నిజానికి ఆమె తప్పిపోలేదు, కొడుకే ఆమెను వదిలించుకుని వెళ్ళిపోయాడు. ఏటా కొడుకులు ఇలా తమ తల్లుల్ని సాగరద్వీపానికి తీసుకొచ్చి అక్కడ తల్లుల్ని వదిలివెళ్ళిపోవడం షరా మామూలే. కానీ ఆ సైనికుడు మాత్రం ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు!!

*********************

ఎటుచూసినా అనంత జలరాశి! పవిత్ర గంగానది సాగరసంగమ ప్రదేశం ఇది. చాలా పవిత్రక్షేత్రంగా పేరుగాంచింది. నా అదృష్టంకొద్దీ ఇక్కడ డ్యూటీ వేశారు నాకు. కలకత్తా నగరం నడిబొడ్డు నుంచి వంద కిలోమీటర్లకు పైగా దక్షిణంగా ఉంది ఈ చోటు. ఇది ఒక పెద్ద ద్వీపం. ఈ ద్వీపం నుంచి కొద్దిదూరంలో అంతర్జాతీయ సముద్ర జలాలు ఉంటాయి. ఈ ద్వీపాన్ని సాగర్‌ద్వీప్‌ అని, గంగ సాగర్‌ అని పిలుస్తుంటారు.ప్రతి ఏడాదీ సంక్రాంతి సమయంలో గంగ సాగర్‌ మేళా జరుగుతుంది. దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా జనం ఈ పవిత్ర మకర సంక్రమణ సమయంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడానికి, పిండ ప్రదానాలకి వస్తుంటారు. అలహాబాద్‌లో జరిగే కుంభ మేళాకి ఎక్కడెక్కడినుంచో నాగా సాధువులు వస్తున్నట్లే ఇక్కడకు కూడా వస్తుంటారు.ఆర్మీలో కింది స్థాయి ఉద్యోగిని నేను. సాధారణ జవాన్‌ని. యుద్ధాలలోనే ఆర్మీకి పని ఉంటుందనుకునే వాడిని ఈ ఉద్యోగంలో చేరకముందు. కానీ, శాంతి సమయాలలో కూడా వెన్ను విరిచేటంత పని ఉంటుందని సైన్యంలో చేరాకే తెలిసింది.

అయితే శరీరం ధృడంగా ఉంచడంలో ఆర్మీ మమ్మల్ని బాగానే చూసుకుంటుంది కాబట్టి ఎంత పనైనా అవలీలగా చేసే శక్తి ఉంది.ఒకపక్క విధి నిర్వహణ చేస్తూనే ఈ ప్రఖ్యాత మేళాను చూసే అవకాశం అనుకోకుండా వచ్చింది. ఆర్మీ వాళ్ళకోసం ఈ గంగాసాగర్‌లో కొంతచోటు ప్రత్యేకంగా కేటాయించి ఉంచారు. అక్కడకు వేరేవాళ్ళని రానివ్వకుండా బారికేడ్లు కట్టారు కాబట్టి, మావరకు సౌకర్యంగానే ఉంది. ఉండటానికి కావలసినంత చోటు, తిండికోసం మెస్‌ ఏర్పాట్లు చేయించారు ఆర్మీ అధికారులు. ఈద్వీపం అంతర్జాతీయ హద్దులకు దగ్గరలో ఉండడంవల్ల దీన్ని నిరంతరం కాపుకా‍సుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ద్వీపంపై ఆర్మీ ఉనికి బలంగా ఉంటుంది.