ఒకానొకప్పుడు సీతాపురమనే గ్రామంలో లక్ష్మీపతి అనే భాగ్యవంతుడు ఉండేవాడు. వివాహమై ఎన్నేళ్లు గడిచినా ఆయనకు సంతానం కలుగలేదు. అందుకని ఎందరో సాధుపుంగవుల్ని సంప్రదించి - ఎన్నో పూజలు, వ్రతాలు చేయగా - ఆయనకో కొడుకు పుట్టాడు. అతడికి నారాయణ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచసాగాడు లక్ష్మీపతి.

లేక లేక పుట్టిన కొడుకని తలిదండ్రులు నారాయణని ఎంతో గారాబం చేసేవారు. కానీ అందువల్ల నారాయణ చెడిపోలేదు. బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నాడు. చదువులో రాణించాడు. అందరిచేతా మంచివాడనిపించుకున్నాడు. అతణ్ణి సీతాపురంలో అభిమానించనివారు లేరు.ఒకరోజు నారాయణ ఏదో పనిమీద ఒంటెద్దు బండిలో పొరుగూరికి వెళ్లాడు. ఆ రోజు ఎండలెక్కువగా ఉండడంవల్ల అతడికి దారిలోనే వడదెబ్బ తగిలింది. నోట మాట కూడా రాకపోతే, దాహం వేస్తోందని బండి తోలే శివయ్యకి సైగ చేసి స్పృహతప్పి పడిపోయాడు.శివయ్య దగ్గర్లో చూసి ఎక్కడా జలాశయాలు కనపడకపోవడంతో మారాలోచన చెయ్యకుండా ఎద్దును అదిలించి బండిని త్వరగా పరుగెత్తించాడు.

బండి పొరుగూరు చేరగానే, ముందుగా కనిపించిన ఇంటిముందు బండినాపి ఇంటివాళ్లకు పరిస్థితి చెప్పుకున్నాడు.అదో పూరిగుడిసె. అందులో ఓ పేదవాడు తన కూతురు సునందతో ఉంటున్నాడు. అతడు ఏ మాత్రం సంకోచించకుండా నారాయణను తనింట్లోకి చేర్చి శీతలోపచారాలు చేశాడు. ప్రయోజనం కనిపించలేదు. అప్పుడు పేదవాడు సునందతో, ‘‘అమ్మా! ఇతణ్ణి రక్షించడం మన వల్లకాదు. నేను వెళ్లి వైద్యుణ్ణి పిల్చుకుని వస్తాను. ఈలోగా ఇతడికి నీవు ఆగకుండా విసనకర్రతో విసురుతూండు. మధ్యలో ఇతడికి స్పృహ కనుక వచ్చి లేచి మంచినీళ్లడిగితే వెంటనే ఇవ్వు’’ అన్నాడు.

సునంద నారాయణకు విసనకర్రతో విసర సాగింది. పేదవాడు, శివయ్య వైద్యుడికోసం వెళ్లారు. వాళ్లిద్దరూ వచ్చేలోగానే నారాయణకు స్పృహవచ్చి, ‘‘దాహం దాహం!’’ అన్నాడు. వెంటనే సునంద మంచినీళ్లు తెచ్చిచ్చింది. నారాయణ వెంటనే నీళ్లందుకుని ఆబగా తాగేశాడు. దాహం తీరేక చుట్టూ చూస్తే తనెక్కడో కొత్త చోటుకి వచ్చి, కొత్త మనుషుల మధ్య ఉన్నట్లు గ్రహించిన నారాయణ సునందను చూసి ఆశ్చర్యపడి, ‘‘నువ్వెవరు? నేనిక్కడికెలా వచ్చాను?’’ అన్నాడు. సునంద అతడికి జరిగింది చెప్పింది.