ఒక్కగానొక్క కొడుకు. అనారోగ్యంతో బాధపడుతుంటే ఎంతో టెన్షన్‌ పడ్డాడతను. రెండు రోజులు హాస్పిటల్‌లోనే గడిపాడు. ఇప్పుడు అతని అసిస్టెంట్‌ కొడుక్కి కూడా అలాంటి సమస్యే వచ్చింది. అతడికి ఇంటిదగ్గరనుంచి ఫోన్‌. మా తమ్ముడి కొడుక్కి షడన్‌గా నొప్పి వచ్చి ఆపరేషన్‌ చేశారండీ, హాస్పిటల్‌లో ఉన్నాం, వాడికి చెప్పండి అన్నాడు అతడి అన్నయ్య. అమ్మో! అని వెంటనే ఇంటికి బయల్దేరమన్నాడు అసిస్టెంట్‌ని. కానీ ఆ అసిస్టెంట్‌ ఏమన్నాడంటే...

ఈ రోజు ఆదివారం కావడంతో పక్కమీద ఇంకా దొర్లుతూనే ఉన్నాను. శ్రవణ్‌ కూడా ఇంకా లేచినట్లు లేదు. వాడి మాటలేం వినపడటం లేదు. పూజగది నుంచి గంట శబ్దం వినిపిస్తోంది.. అంటే జయంతి పూజ అయిపోవచ్చిందన్నమాట. పాచిమొహంతో హారతి కళ్ళకద్దుకుందామంటే ఊరుకోదు. లేచి బాత్‌రూంలో దూరాను.

ఓ పావుగంటలో కాలకృత్యాలు తీర్చుకున్నాను. వచ్చి సోఫాలో కూర్చుని న్యూస్‌పేపరు అందుకున్నాను. రోజూ కొత్తవార్తలు ఏం ఉంటాయి? అధికారపార్టీ ఆడంబరాలు, అపోజిషన్‌ పార్టీ ఆరోపణలు, అంతుచిక్కనివ్యాధితో వైద్యసహాయం అందక గిరిజన స్త్రీ మృతి, నాలుగేళ్ళ దళితబాలిక మానభంగం, ముక్కుపుడకకోసం ముసలమ్మ మర్డర్‌...పేపర్‌ ప్రక్కన పడేసి టీవీ ఆన్‌ చేశాను. అక్కడా అదే గోల.జయంతి ఓ చేత్తో గ్లాసులో గోరువెచ్చని నీళ్ళు, మరోచేత్తో ఒక కప్పు కాఫీ పట్టుకొచ్చి టీపాయిమీద పెట్టింది.‘‘మరచిపోయారా? సత్యం కూతురు నిశ్చితార్థానికి వెళ్ళాలన్నారు’’ అంది చిరునవ్వుతో.అప్పుడు గుర్తొచ్చింది. సత్యం నా దగ్గర పనిచేసే నా అసిస్టెంట్‌. అతగాడికి ముగ్గురు కూతుళ్ళు, ఓ కొడుకు పెద్ద కూతురు నిశ్చితార్థం ఈ రోజు. తప్పక రావాలని చెప్పాడు.‘‘అవును కదూ! పదకొండింటికల్లా అక్కడ ఉండాలి’’ అని గోడ గడియారంకేసి చూశాను. పది కావస్తోంది. నీళ్ళు, కాఫీ గొంతుకలో పోసుకుని లేచాను.ఓ అరగంటలో రెడీ అయ్యి స్కూటర్‌ తీసి బయల్దేరాను. సత్యం ఇంటికెళ్ళేటప్పటికి సరిగ్గా పదకొండయ్యింది. ఇంటిముందు షామియానా వేశారు. కుర్చీల్లో చాలామంది కూర్చుని ఉన్నారు. ఆడ, మగ హడావుడిగా తిరుగుతున్నారు. పెళ్ళికూతురు కొబ్బరిబొండాం చేత్తో పట్టుకుని కూర్చుంది. పెళ్ళికొడుకు, అతగాడి తల్లిదండ్రులు ఎదురుగా కూర్చుని ఉన్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు.