‘‘నా గోల భరించలేక.. నా భార్య ఇంట్లో పలావు వెలగబెట్టిందో రోజు. ఒట్టన్నంలో కాస్త రంగూ, రెండు అల్లం ముక్కలూ వేస్తే ఎలా ఉంటుందో.. అలా ఉంది పలావు వాలకం. ‘దీన్ని పలావంటారని ఇంకెవరికీ చెప్పకే. బడాయికి పోయి ఎవరికైనా ఓ ముద్ద పెట్టేవూ... వాళ్ల ప్రాణం, మన పరువూ రెండూ ఒకేసారి పోతాయి’’ అంటూ మా ఆవిడకు గట్టిగా వార్నింగిచ్చా. నా అదృష్టం కొద్దీ మా ఆవిడ ఆ తరవాత అలాంటి ప్రయత్నాలేం చేయలేదు..’’..... అంటూ భార్య వంటపై జోకులు పేల్చిన ఆ భర్తకు ఎలాంటి షాకింగ్ అనుభవాలు ఎదురయ్యాయంటే..

*******************

‘‘ఆదివారం ఎప్పుడొస్తుందో’’అంటూ పోయిన ఆదివారం నుంచి ఎదురుచూస్తున్నా. స్కూలుకెళ్లే పిల్లాడు సెలవురోజు కోసం ఎంత ఆత్రుతతో ఎదురుచూస్తాడో అచ్చం అలాసోమారం దిగులుగా గడిచింది. మంగళారం నీరసంగా వెళ్లిపోయింది. బుధ, గురు, శుక్ర అయితే తెగ ఇసిగించేశాయి. శనారం కునుకే లేదు. మధ్యమధ్యలో ‘‘ఏమోయ్‌.. ఆదివారం ఎప్పుడు’’ అని మా ఆవిడ్ని తెగ విసిగించేసేవాడ్ని. ఒకట్రెండుసార్లు నా తొందర చూసి చిన్నగా నవ్వుకున్నా, నాలుగోసారి నుంచి గుర్రుగా చూడ్డం మొదలెట్టింది. ఆడాళ్ల కండ్లలో రోహిణీకార్తె ఎండలుంటాయ్‌ అని ఆనాడే తెలిసింది. అప్పట్నుంచి మా ఆవిడ దగ్గర ఆదివారం టాపిక్కు తీసుకురావడం మానేశాను. అదేంటో స్వాముల చుట్టూ భక్తులు, స్కాముల చుట్టూ రాజకీయ నాయకులు తిరిగినట్టు నా కలలు కూడా ఆదివారం చుట్టే గిర్రుమనేవి.

 

ఆదివారం వచ్చి వెళ్లిపోయినట్టు.. నేను శనారం నిద్రోయి.. సోమారం లేచినట్టు.. ఏంటో పిచ్చి కలలు. ఇలా ఎదురుచూస్తూ ఎదురుచూస్తూ.. ఆదివారాన్ని జుట్టట్టుకుని లాక్కొచ్చేయాలన్న కసి పెరిగి పెరిగి, కళ్లు కాయలు కాచి, పండ్లయిపోయి.. నీరసించి.. నశించి కృశించిన వేళ... ఏదోలా ఓరోజు ఆదివారం వచ్చేసింది. తప్పిపోయిన లేగదూడ మళ్లీ వెదుక్కుంటూ సొంతింటికే వచ్చినంత సంబరంగా అనిపించింది. అది నా పుట్టినరోజు కాదు. పెళ్లి రోజు అంతకంటే కాదు. మరి ఆదివారం కోసం ఎందుకింత హైరానా? ఆడికే వస్తున్నా.

 

‘‘ఐత్వార్‌ మేరీ బేటీ కా షాదీ.. ఆప్‌ జరూర్‌సే ఆనా..’’ అని గౌస్‌ గారు చేతిలో శుభలేఖ పెడుతూ చెప్పినప్పటి నుంచీ ఆదివారం కోసం ఆరాటం మొదలైపోయింది. గౌస్‌గారు నాకు జాన్‌ జిగీర్‌ దోస్తేం కాదు. ఉత్త పరిచయమంతే. మా ఇంటి దగ్గర్నుంచి రెండు వీధుల అవతల ఆయనిల్లు. ఓ నాలుగు నిమిషాలు కాలికి పనిచెబితే గౌస్‌ గారి గుమ్మం ముందు ఆగొచ్చు. ఆయన కూతురికి పెళ్లి కుదిరింది. మాట వరుసకు పెళ్లిపిలుపులు అందాయి. గౌసు గారు మొహమాటం కొద్దీ పిలిచినా.. నాకు మాత్రం సిగ్గు లేకుండా ఆయనింటి పెళ్లికి వెళ్లిపోవాలని వుంది. ఎందుకంటే.. అది సాయిబుల ఇంట్లో పెళ్లి.