సంతృప్తికిగానీ, అసంతృప్తికిగానీ కొలమానం ఉండదు. మన ఊళ్ళో తాతలనాటి మన సొంత ఇంట్లో ఉంటూ, మనూరు గాలి పీలుస్తూ, బంధువులతో చెలొపొలో మని కలిసి ఉన్నదాంట్లోనే సరదాగా బతుకుతూ ఉంటే ఎలా ఉంటుంది? పెద్ద చదువులు చదివినవాడు పల్లెటూర్లో ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ అలా ఉండిపోలేడు, నిజమే! కానీ సంతృప్తి ఉన్నవాడు మాత్రం అలా ఎప్పుడూ అనుకోడు. తన ఊళ్ళోంచే ప్రపంచంతో అనుబంధం పెంచుకుంటాడు. ఈ కథలో రామూ కూడా అలాగే చేశాడు.
******************************
టంగ్ టంగ్....రెండుసార్లు గంటమోగడంతో సన్నిధి ముందర మెట్లపై ఆనుకుని నీరసంగా కూర్చుని కునుకుతున్న రాము మెల్లగా కళ్ళు తెరచి చూశాడు. బైక్ ఇంజన్ ఆపకుండానే మెట్టుమీద ఒక కాలు ఆన్చి గంటతాడు పట్టుకుని లాగుతున్న మోహనరెడ్డి కనిపించాడు. బైక్‌మీదనుంచి సగంపైకిలేచి ఒంటికాలితో బైక్‌ను బ్యాలెన్స్ చేస్తూ తాడుపట్టుకుని మరోసారి లాగి వదిలాడు. టాంగ్...అంటూ ఆ శబ్దం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఒక పెద్ద కాంట్రాక్టర్ దగ్గర నమ్మకమైన గుమస్తాగా పనిచేస్తున్న మోహన్‌రెడ్డి, గుడిలోని దేవుడివైపు చూడనైనా చూడకుండానే గంట తాడు వదిలిన చేతితో లెంపలేసుకుంటున్నట్టుగా రెండుచెంపలనూ సుతిమెత్తగా తాకి రయ్‌ఁమంటూ బండిమీద దూసుకుపోయాడు.రాము అనే రామనాథశర్మ ఆ ఊరి చిన్నవినాయకుడి గుడికి పూజారి. మంత్రాలమీద అతని తండ్రి పరమేశ్వరశర్మకి ఉన్నంతపట్టు ఇతనికి లేదని ఊరి జనం నమ్మకం.
తిరుపతి నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం ఒకప్పుడు పల్లెటూరే. వారపుసంతలో దొరికేవి కాకుండా ఏ పెద్ద వస్తువు కొనాలన్నా ఇటు తిరుపతికిగానీ అటు కాళహస్తికిగానీ, పుత్తూరుకుగానీ పోవాలసిందే.ఈమధ్య కొన్ని బ్రాండెడ్ షోరూంలు కూడా రేణిగుంట పరిసరప్రాంతాలలో వచ్చాక దూరాభారం తిరిగే పని తగ్గింది. ఆన్ లైన్ షాపింగ్‌లూ, జొమాటో, స్విగ్గీలు తమ ఊళ్లోకీ ఎప్పుడొస్తాయా అని ఆ ఊరి కుర్రకారు ఎదురుచూస్తూ ఉంది.ఇవేవి పట్టని రాము మాత్రం గుడిలోపలికి వచ్చి మొక్కుకునే భక్తులకోసం ఎదురుచూస్తూ ఉంటాడు. హారతి తీసుకున్న భక్తుడు ఒక రూపాయి బిళ్ళైనా తట్టలో వేయకపోతాడా అని ఆశ.