పాతపట్నం రాజు పురంజనుడికి ఉన్నట్టుండి, ఒక ఆలోచన తట్టింది. సభలో మంత్రి సామంతులు. పౌర ప్రముఖుల ముందు దానిని ఇలా ప్రకటించాడు.‘‘రాజ్యంలో ఎవరైనా సరే మంచి అబద్ధం చెప్పగలిగితే ఆ అబద్ధానికి కూర్చున్న వ్యక్తి వెంటనే లేచి నిల్చోగలగాలి. అలాగే నిద్రిస్తున్న వ్యక్తి మేల్కొనగలగాలి. అలా చేయగలిగితే నా సింహాసనం వారిదే! అంటే ఈ రాజ్యం వారి సొంతం అవుతుంది.’’ అన్నాడు.‘‘ఆట ఎలా ఉంది?’’ అడిగాడు.‘‘బాగు బాగు’’ అన్నారు సభలోని వారంతా. రాజుగారి ఆలోచనకూ, ఆట తీరుకూ కరతాళ ధ్వనులు చేశారు.‘‘ఈ విషయాన్ని వెంటనే దండోరా వేయించండి. అబద్ధాలు చెప్పగలిగే మహామహులకు ఇదే మా ఆహ్వానం అని ప్రకటించండి.’’ అన్నాడు పురంజనుడు. రాజుగారి ఆదేశాన్ని పాలించారు సేవకులు. పాతపట్నంలోనే కాదు, పక్క పట్నంలోనూ రాజుగారు చెప్పినట్టుగానే దండోరా వేశారు.మర్నాడు నుంచీ అబద్ధాలు చెప్పేందుకు తండోపతండాలుగా జనం రాసాగారు. వారు చెప్పిన ఏ ఒక్క అబద్దానికీ కూర్చున్న వ్యక్తులు నిల్చోలేదు. సమీపంలో నిద్రిస్తున్న వ్యక్తులు మేల్కొన లేదు. నవ్వుల పాలయి వెళ్ళిపోయారంతా. తెల్లారితే చాలు, వచ్చే జనం, పోయే జనం. ఏ ఒక్కరి అబద్ధమూ అతికినట్టుగా ఉండడం లేదు. పైగా సభ అంతా గందరగోళంగా తయారయింది. వచ్చే జనాన్ని నిలువరించాలనుకున్నారు రాజోద్యోగులు. రాజుగారి అంగీకారం మేరకు ప్రకటన మార్చి ఇలా దండోరా వేశారు.

‘‘రాజ్యంలో ఎవరైనా సరే మంచి అబద్ధం చెప్పగలిగితే ఆ అబద్ధానికి కూర్చున్న వ్యక్తి వెంటనే లేచి నిల్చోగలగాలి. అలాగే నిద్రిస్తున్న వ్యక్తి మేల్కొనగలగాలి. అలా చేయగలిగితే రాజుగారి సింహాసనం వారిదే! అంటే ఈ రాజ్యం వారి సొంతం అవుతుంది. లేని పక్షంలో అబద్ధం చెప్పిన వ్యక్తి తల తెగి నేల రాలుతుంది.’’జనం భయపడ్డారు. సభకు రావడం మానుకున్నారు. ప్రాణాలతో చెలగాటం దేనికని ఊరు కున్నారు. పొద్దున నుంచి రాత్రి వరకూ వేచి చూసినా ప్రాణాలకు తెగించి ఏ ఒక్కరూ రాకపోవడంతో పురంజనుడికి పిచ్చెక్కినట్టయింది.‘‘సభంతా ఖాళీగా ఉంటోంది. ఊసుపోవట్లేదు. మార్చిన ప్రకటన మనసుకి ఊరట కలిగించట్లేదు సరికదా, బాధపెడుతోంది.’’ అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు. అంతలో ఎవరో వచ్చినట్టయింది. కళ్ళు తెరిచి చూశాడు. దర్జీ కనిపించాడతనికి. ఆస్థానంలో పని చేస్తున్న దర్జీనే! అందుకే వెంటనే గుర్తుపట్టాడు రాజు.