మామగారు డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని ఎదురుచూస్తున్నారు.అన్నింటినీ డైనింగ్‌ టేబుల్‌మీదకి చేర్చి, గబగబా తమ బెడ్‌రూమ్‌లోకి వచ్చింది రాణి.భర్త ఇంకా తయారవుతూనే ఉన్నాడు.‘‘ఏంటండి అంత నెమ్మదిగా తయారవుతున్నారు. మామయ్యగారు అక్కడ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని చాలాసేపైంది!’’

‘‘అయితే నన్నేం చేయమంటావ్‌?’’‘‘తొందరగా తెమలి రమ్మంటాను’’.‘‘ఎందుకట అంత తొందరపడడం ఆయనకోసం...’’‘‘కాదు మర్యాదకోసం!’’‘‘నాకాయనతో మర్యాదేమిటి? మా అన్నదమ్ముల్లో నేనొక్కణ్ణే తెలివిగలవాణ్ణి. నన్ను మెడిసిన్‌లో చేర్పించమని బతిమాలితే ఆయన నా కోరికకి ఏం మర్యాదిచ్చారు? నాకు కొడుకులందరూ ఒక్కటే! అందరిని డిగ్రీవరకు మాత్రమే చదివిస్తానని ఖరాఖండిగా చెప్పారు! తన మాటమీదే చివరివరకు నిలబడ్డారు. అప్పుడు మా పక్కింట్లో ఉండే మీ నాన్న దయ తలచడంవల్ల నేను మెడిసిన్‌లో చేరాను. అందుకే ఆయన మాటకి మర్యాదిచ్చి నిన్ను చేసుకున్నాను’’ తల దువ్వుకోబోతున్నవాడల్లా చటుక్కున భార్య రాణిని దగ్గరకు లాక్కున్నాడు.

‘‘బావుంది పట్టపగలు మీ సరసం. ఆయన ఎదరు చూస్తున్నారు. త్వరగా రమ్మని పిలవడానికి నేనిక్కడకి రావడం తప్పయిపోయినట్లుందే!’’‘‘నువ్వు రావడం కాదు, ఆయనకోసం రావడం తప్పయింది!’’‘‘ఏమిటండి ఆయనంటే అంతకోపం? మీ నాన్నగారాయన. అది గుర్తుంచుకోండి’’‘‘ఆయన మాత్రం నన్నెప్పుడు కొడుకుగా గుర్తించలేదు. నేనో మంచి సర్జన్‌గా పేరుతెచ్చుకున్న తర్వాత ఆయన మనసుమారి, తన ఆరోగ్యం కోసం పరుగెత్తుకొచ్చారు మనింటికి’’.‘‘ఆయనేమీ రాలేదు. నేను పిలిపించాను’’ అంది భర్తకి దూరంగా జరుగుతూ రాణి.

‘‘నాకు చెప్పకుండా ఎందుకు పిలిపించావ్‌?’’‘‘నేను అత్తయ్యగారికి ఫోన్‌ చేసినప్పుడు, ‘మావయ్యగారికి ఏమీ బావుండడం లేదు, చాలా నీరసంగా ఉంటున్నారు. ఛాతీలో అసౌకర్యంగా ఉంటోంది’ అని చెప్పారు. ‘వాడు గుండెకి సంబంధించిన నిపుణుడేగా! అక్కడికి తీసుకురావాలనుంది’ అని ఆవిడ ఎంతో బాధగా చెప్పలేక చెప్పలేక చెప్పారు. వెంటనే ఆయనను తీసుకొచ్చేయమన్నాను’’.