ఆమె ఎనభైయేళ్ళ వృద్ధురాలు. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. ఆమె ఎవరో ఆమెకే తెలియదు. వాళ్ళవరండా నిద్రపోతోంది. ఆమెకేమీ గురుతు లేదు. ఆ దంపతులు ఆమెకు ఆశ్రయమిచ్చి ఆదరించారు. ఆ ఇంట్లో అతని తండ్రి పరిస్థితి కూడా దాదాపు అంతే. ఎవరినీ గురుతుపట్టలేడు. తానెవరో, ఎక్కడున్నాడో కూడా తెలియదు. వీళ్ళిద్దరినీ ఒకేగదిలో చెరోమంచంమీదా ఉంచారు ఆ దంపతులు. అప్పుడు జరిగిందో మిరాకిల్‌! ఏమిటది?

*******************************

వరండాలో పడుకున్న మనిషి జ్వరంవల్లనో, చలివల్లనో, ఆకలివల్లనో వణుకుతూ ఉంది. లేపితే లేవలేదు. మునగదీసుకుని మూలకుజరిగి పడుకుంది. పనిమనిషితోపాటు ఇంటి ఇల్లాలుకూడా వచ్చి చూసింది.రూపం, బట్టలు, చూచి బిచ్చగత్తెకాదనీ, పిచ్చిమనిషికూడా అయి ఉండదనీ వాళ్ళిద్దరూ తీర్మానించుకున్నారు. ఎంతలేపినా లేవటం లేదు. ‘లేచి వెళ్ళిపో!’ అంటే ఆమె వినిపించుకున్నట్లు లేదు. లేవలేదు. వెళ్ళలేదు. రాత్రి ఎప్పుడు వచ్చి పడుకుందో!ఇంటి ఇల్లాలు శాంతి జ్వరంమాత్ర నీళ్ళు తెచ్చి ఆమె నోట్లోవేసి, నీళ్ళు తాగించింది. దుప్పటితెచ్చి కప్పింది. కప్పుకుని, మరింత కుంచించుకొని పడుకుంది. ఆమె ఉన్నచోటు వదిలేసి, మిగతా వరండా ఊడ్చి, తడిగుడ్డతో తుడిచి పనిమనిషి వెళ్ళిపోయింది.భర్త సుబ్బారావు బ్యాంకుకు వెళుతూ, వరండామూలన పడుకున్న మనిషినిచూచి ‘ఎవరూ?’ అన్నాడు. ‘ఎవరో!’ అంది శాంతి. ‘ఆమె కట్టుకున్న చీరె, జాకెట్టు, విలువైనవి. దువ్వుకొన్న తల చెదరలేదు’.‘తాగినట్టుందా?’‘రామ! రామ! అట్లాంటి మనిషిలా లేదు!’‘ఇంట్లో కొట్లాడి వచ్చి ఉంటుందా?’‘ఇక్కడికే ఎందుకు వస్తుంది? మీ నాన్నగారిలాంటి అనారోగ్య స్త్రీ కావచ్చుననిపిస్తుంది’.ముందుకు అడుగేస్తున్న సుబ్బారావు ఆగి, అటూ ఇటూ తేరిపార జూచి ‘జాగ్రత్తగా చూడు! ఆమెవాళ్లు రావచ్చు. వచ్చి తీసుకుపోయిందాకా కాపాడదాం, సరేనా?’ అన్నాడు. అతనికి చనిపోయిన తనతల్లి గుర్తుకు వచ్చింది.

సుబ్బారావు గతించిన తనతల్లి జ్ఞాపకం దిగులు కలిగించింది. శాంతికీ మరణించిన తనతల్లి జ్ఞప్తికి వచ్చింది. శాంతి తల ఊపింది. ఈమె ఇంట్లో ఉన్న చిన్నారావువంటి మతిస్తిమితం లేని మనిషి కావచ్చునని ఊహించింది.చిన్నారావు గొప్ప మేధావి. బ్యాంకు లెక్కల్లో చిక్కులు విడమర్చిచెప్పగల సమర్థుడు. ముప్ఫైఏళ్ళు పనిచేశాడు. ఐదేళ్ళు బ్యాంకు సలహాదారుగా ఉన్నాడు. డెబ్బయ్యో ఏట భార్య కాలంచేసింది. ఐదేళ్ళు ఆమె స్మృతులతో జీవించాడు. ఏదో నోటు బుక్కులమీద ఏదేదో అంకెలు రాసేవాడు, కొట్టేసేవాడు. ఎనభయ్యో ఏట నుంచి ఏమీ రాయటం లేదు. పిలిస్తే చూస్తాడు. ‘ఆఁ’ ఊఁ’ అంటాడు. ఏమీ చెప్పడు. స్నానం చేయించాలి. బట్టలు మార్చాలి. ఎవరినీ ఏమీ అనడు. తిట్టడు. కొట్టడు. మౌనంగా ఉంటాడు. పెడితే తింటాడు. ఇస్తే తాగుతాడు. కావాలని అడగడు. లేవని చికాకుపడడు. ఏమీ పెట్టకపోయినా, అడక్కుండా, గొణక్కుండా పడుకుంటాడు.