బెలగాం భీమేశ్వరరావు మాస్టారు పార్వతీపురం టౌన్ ఆడబడి వీధి హైస్కూల్లో ఆ రోజే రిటైర్ అవుతున్నారు. పొరుగునే తాతలనాటి పండావీధి లోని సొంతింటి నుంచి బయలుదేరుతూనే మాస్టారి నడక భారమైపోయింది. స్కూల్ రిజిస్టర్లో ఆఖరి సంతకం చేస్తున్నప్పుడు ఏదో ఉద్వేగం. కుదురుగా రాసే భీమేశ్వరరావు మాస్టారి చెయ్యి సన్నగా వణికింది.

‘‘రేపు ఈ రిజిస్టర్ ఉన్నా, ఇందులో నా పేరు ఉండదు. ఈ చేతిలో పెన్ను ఉన్నా, ఇక్కడ సంతకం చేసే అవకాశం ఉండదు’’ అనుకుని, తాత్త్వికంగా నవ్వుకున్నారాయన. సహోద్యోగులు, విద్యార్థులూ మాస్టారికి శాలువాలు కప్పారు. దండలు వేశారు. జ్ఞాపికలు బహూకరించారు. పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు వారి కోసం పాటలూ, కథలూ రాస్తూ బాలసాహిత్యంలో కృషి చేస్తున్న భీమేశ్వరరావు మాస్టారు తమ స్కూలుకు గర్వకారణమన్నారు. చివర్లో తనవంతుగా కృతజ్ఞతలు చెబుతూ బెలగాం భీమేశ్వరరావు,-‘‘మహారాజా అని పిలిపించుకోవడం కన్నా గురువుగారూ అనిపించుకోవడం గర్వకారణమని భావిస్తాను.

ఈ టైటిల్ మా తాతగారి వారసత్వంగా సంక్రమించడం నేను చేసుకున్న అదృష్టం. ‘రిలే రన్నింగ్ రేస్’ లో ‘బాటన్’ ని ఒకరి నుంచి మరొకరు అందుకుని గమ్యం వైపు దూసుకుపోయే ఆటగాళ్ళ స్ఫూర్తి ఈ వృత్తిలో నాకు కనిపించింది. కాకపోతే ఒక్కటే లోటు....’’ అంటూ ఒక్కసారి నిట్టూర్చారాయన.ఆ లోటేమిటో చెప్పే ముందు- తమ తాత బెలగాం చినకూర్మన్నగారి కృషి భీమేశ్వరరావుకు గుర్తుకొచ్చింది. నారుమడి బతుకులు పాఠాల బడి వైపు మళ్లిన తీరు గుర్తుకొచ్చింది. పద్దెనిమిదో శతాబ్దం చివర్లో బెలగాం నాయుడు వీధిలో అక్షర సేద్యానికి ఏరువాక తోలిన ‘గురువు బడి’ జ్ఞాపకాలు ముసురుకున్నాయి.