‘‘ప్రకాశ్ రేపు ఏ ఎసైన్‌మెంట్ కాన్సిల్ చేసుకుంటావో టైమ్ ఎలా ఎడ్జెస్ట్ చేసుకుంటావో నాకనవసరం. సాయంత్రం నాలుగింటికల్లా క్రాంతి బాబా ఆశ్రమానికి వెళ్ళాలి’’ ఫోన్‌లో బాస్ చెప్పింది విని ఆశ్చర్యపోయాను. ‘క్రాంతి బాబాని కలవాలంటే అంత సులభం కాదు. వి.ఐ.పిలకు తప్ప ఇంకెవరికీ అందుబాటులో ఉండడు. అలాంటిది ఇంత సడెన్‌గా కలవటం ఏమిటి?’ అదే అడిగాను.
‘‘మనం ఎన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగినా కుదరదన్నారు. అలాంటిది నిన్న ఆయనే స్వయంగా ఫోన్ చేసి ‘జర్నలిస్ట్ ప్రకాశ్‌ని పంపండి. ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తాను’ అని చెప్పారు. అది విని నేను ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. ఆయన అవకాశం ఇవ్వబట్టిగానీ, లేకపోతే మనవల్ల అవుతుందా?’’ అన్నాడు బాస్. అది విని మరింత ఆశ్చర్యపోయాను.నేను ఓ సీనియర్ జర్నలిస్ట్‌ని. నా కెరీర్‌లో ఇప్పటివరకు దొంగ బాబాలకు, కుటిల రాజకీయనాయకులకు, అక్రమవ్యాపారవేత్తలకు చుక్కలు చూపించాను. అందువలన ఆయా రంగాల వారు నన్ను సాధ్యమైనంతవరకు దూరంగా ఉంచుతారు. అలాంటిది క్రాంతి బాబా తనంతట తానే నన్ను కలవాలని కోరుకోవటం నాలో ఉత్సుకతను రేపింది.
మర్నాడు అపాయింట్‌మెంట్ ఇచ్చిన సమయానికి అరగంటముందే ఆశ్రమానికి చేరుకున్నాను. సెక్యూరిటీ చెక్ అయిన తరువాత ఆశ్రమంలోకి అడుగుపెట్టాను. పూలచెట్లు, పళ్ళమొక్కలతో ఆశ్రమం అద్భుతంగా ఉంది. శిష్యులు, భక్తులు, మేనేజ్‌మెంట్ సిబ్బంది సహా పనిచేస్తున్నవాళ్ళు అంతమంది వున్నాగానీ ఎంతో నిశ్శబ్దంగా ఉంది. ఏదో ప్రశాంతత.‘ఈ బాబాలపని బాగుంది. రూపాయి పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదన. కాసిన్ని కబుర్లు, జిమ్మిక్కులు, మోసంచేసే తెగువ ఉంటే చాలు...ఈ బాబాని సరైన సాక్షాలతో ఎందులోనైనా ఇరికించేయగలిగితే నా పేరు దేశవిదేశాల్లో మారుమ్రోగిపోతుంది’ కసిగా అనుకున్నాను.