నా కూతురు తెలిసో తెలియకో తప్పు చేసింది. మీ అబ్బాయని పెళ్ళి చేసుకుంది. నా కూతురును ఏమీ చెయ్యకండి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఆమెను నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అంటూ ఓ సగటు తండ్రి కన్నీళ్ళతో ఒక ఉత్తరం రాశాడు. నిద్రపట్టని ఆ రాత్రి తెల్లవారకముందే బయలుదేరి ఓ ఇండస్ర్టియలిస్ట్ భవంతిముందుకెళ్లి ఆ ఉత్తరం సెక్యూరిటీ గార్డు చేతిలో పెట్టి వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది?
‘‘నాన్నా... నాన్నా....!’’ దిగ్గున లేచాడు భానుమూర్తి. గుడ్డిగా వెలుగుతున్న బెడ్‌బల్బు, లైట్ వేశాడు. గది నిండా వెలుగు పరుచుకుంది.భార్య గాఢనిద్రలో ఉంది. ఏడ్చిఏడ్చి ఉబ్బినట్టున్న కళ్ళు. ‘పాపం! ఎప్పుడు నిద్రపోయిందో?!’ అనుకున్నాడు. గోడ గడియారం నాలుగు గంటలు చూపిస్తోంది. ఇక మరి నిద్రరాదు. తెల్లారేవరకూ జాగరణే!‘నాన్నా.... నాన్నా!’’ మళ్ళీ పిలిచినట్టయింది. తన భ్రమగానీ చిన్నతల్లి ఇంట్లో ఎందుకుంటుంది? దిగులు మనసునిండా. కన్నీళ్ళు ఒక్కటే తక్కువ. భార్య మరీ బెంగపడుతుందని కన్నీళ్ళు రాకుండా బలవంతంగా ఆపుకుంటున్నాడు.ఆ గది దాటి బయటకొచ్చాడు. పక్క గది చిన్నతల్లిది. లోపలకు అడుగుపెట్టాడు. గదంతా పరిమళం. చిన్నతల్లి అగరువత్తులు వెలిగిస్తుంది.
నిన్నటి ఉదయం వెలిగించిందేమో! గదినిండా పరుచుకున్న ఆ వాసనలు ఇంకా వదిలిపోనంటున్నాయి, వెంటాడుతున్న తన జ్ఞాపకాల్లా. నిట్టూర్చాడు. ఆగదిలో పొందికగా సర్దిన సామాను. చిన్నబెడ్, దానిపై తెల్లటి దోమతెర, చదువుకునే టేబుల్ మీద మధ్యకు మడిచిపెట్టిన పుస్తకం. పాల్‌కోయిలో రాసిన ఆల్కెమిస్ట్, దాని పక్కనే డైరీ. తనే అలవాటు చేశాడు డైరీ రాయడం. పేజీలు తిరగేస్తున్నాడు.‘పుస్తకాలు చదువు తల్లీ జ్ఞానం వస్తుంది అంటాడు నాన్న నన్ను. అసలు నాన్నే ఒక ఉద్గ్రంథం. నాన్నను చిన్నప్పట్నించీ చదువుతున్నాను. ఆయన నైతికత, నిబద్ధత’.చదవడం ఆపి ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు. ‘మరి అయితే ఈ నైతికత ఏమయిందమ్మా!’ వెంటనే చెంపమీద చెళ్ళున చరిచినట్టయింది భానుమూర్తికి. ‘కూతురు చేసిన దాంట్లో అనైతికత ఉందా?!’ క్షణం సేపు కళ్ళు మూసుకున్నాడు. జరిగిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకున్నాడు.