జీవి పరిణామక్రమంలో ప్రకృతివల్ల ఎదురయ్యే భయాలు, అభద్రతల కారణంగా మానవ సమాజంలో మతభావన పురుడుపోసుకుంది. లక్షల సంవత్సరాల తర్వాత కూడా మనిషి ఎంత అత్యున్నతమైన నాగరికత సంపాదించినా, ఇతర గ్రహాలకు రాకపోకలు సాగించే దశకు చేరుకున్నాగానీ ఆ విషయంలో మార్పు సాధించలేకపోవడం ఆశ్చర్యకరం! ఈ కథలో కూడా అనిమిష తండ్రిది అదే పరిస్థితి!!

క్రీ.శ. 2,150వ సంవత్సరం.పి.వి.రావు వాకింగ్‌కు బైలుదేరాడు. దారిలో వి.బి.మూర్తి ఎదురయ్యాడు. ఇద్దరూ ఒక మోస్తరు మిత్రులు. రిటైరయ్యాక వాకింగ్‌లో కలుస్తూంటారు.‘‘నమస్కారం మూర్తిగారూ! బాగున్నారా?’’ పలకరించాడు. రావు.‘‘బాగున్నాను, రావుగారూ! మీరెలా ఉన్నారు?’’ ‘‘బాగున్నాను’’ ‘‘పిల్లలెలా ఉన్నారు?’’ ‘‘బాగున్నారు’’ ‘‘ఎక్కడున్నారు?’’ ‘‘అదే! బాబు ‘మార్స్‌’లో పాప ‘మూన్‌’లో ఉన్నారు. ఉద్యోగాలు చేసుకుంటూ. ఇంకోడు ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఇండియాలోనే ఉన్నాడు. అన్న దగ్గరికి పోవాలని వాడి ఉద్దేశం’’ అన్నాడు రావు.‘‘మీరేమైనా వెళ్తున్నారా?’’‘‘అదే! బాబూ ‘మార్స్‌’లో, పాప ‘మూన్‌’లో ఉన్నారు. ఉద్యోగాలు చేసుకుంటూ. ఇంకోడు ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ఇండియాలోనే ఉన్నాడు. అన్న దగ్గరికి పోవాలని వాడి ఉద్దేశం’’ అన్నాడు రావు.

‘‘మీరేమైనా వెళ్తున్నారా?’’‘‘లేదు. ఆ ఐటీయం ఓవర్‌హాల్‌ చేస్తున్నారట. ఇంకో నెలదాకా కుదరకపోవచ్చు. మీ వాడెక్కడున్నాడు?’’‘‘మా వాడు ‘టెరాండియా’లోనే ఉన్నాడు. దూరం వెళ్లడట ‘ఇక్కడైతే ఏడాదికి ఓసారి రావచ్చు గదా’ అంటున్నాడు. నన్ను రమ్మంటున్నాడుగానీ, నాకు కుదరడం లేదు’’ అన్నాడు మూర్తి.‘‘అలా అనుకుంటే ఎలా? వెళ్లి కొద్దిరోజులు ఉండి రండి. ఇక్కడ మాత్రం మనం ఏం బావుకుంటున్నాం? ఇదిగో, ఇలా మాస్క్‌లు తగిలించుకుని బతకడమేగా!’’ అన్నాడు రావు.

‘టెరాండియా’ ఇటీవలే కనుక్కున్న గ్రహం. దాని ఖగోళ నామం ‘జజె273బి’. ఆ గ్రహంపై తొలిగా అడుగుబెట్టింది భారతీయులే! అందుకే భారతదేశం దానికి ఇండియా పేరు కలిసొచ్చేలా ‘టెరాండియా’ అని నామకరణంచేసి, అక్కడో పదిలక్షలమందితో కాలనీ నిర్మించింది. ఆ గ్రహంలో పరిస్థితులు ఇంచుమించు భూమిపైలాగే ఉంటాయి’.వాకింగ్‌ అయ్యాక రావూ, మూర్తీ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు.రావు కొడుకు వంశీ, మూర్తి కూతురు అనిమిష ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం పెద్దలిద్దరికీ తెలిసినా, చూసీచూడనట్టు ఊరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ల పెళ్ళి జరగకూడదనేంతగా ఎవరికీ అభ్యంతరాలు లేవు గనుక.