రెండు రోజులుగా భార్యాపిల్లలుసహా పస్తులుంటున్నాడు. ఆకలితో అలమటిస్తున్నాడు. ఈ రోజైనా ఆకలి తీరితే బాగుణ్ణు! వల నిండుగా చేపలు పడితే బాగుణ్ణు అనుకున్నాడు జాలకుడు. ఆకాశంకేసి చూశాడు. కళ్ళు మూసుకున్నాడు. దేవుణ్ణి ప్రార్థించాడు. సముద్రంలోకి వల విసిరాడు. ఆశగా పడవలో కూర్చున్నాడు. ఆకలికీ, సముద్రం మీది చల్లనిగాలికీ కూర్చునే నిద్రపోయాడు. రెండుగంటల తర్వాత మేల్కొన్నాడు. వలను లాగి చూశాడు. బరువుగా తోచింది. ఏదో పెద్ద చేపే పడిందనుకున్నాడు. గట్టిగా లాగి, పడవలోకి వలను చేర్చి, చూశాడు. అనుకున్నట్టుగానే పెద్ద చేపే పడింది. బంగారు చేప! పచ్చగా మెరిసిపోతోంది. మనిషి అంత పొడవు ఉంది. దానిని భుజం మీద వేసుకుని ఇంటికి చేరుకున్నాడు జాలకుడు. భార్యకు చేపని చూపించాడు.‘‘అయ్యబాబోయ్! బంగారు చేప! పెద్ద చేప’’ పొంగిపోయింది భార్య.‘‘దీనిని రాజుగారికి అమ్మి, వచ్చిన డబ్బుతో సరుకులు కొని తెస్తాను. నువ్వు పొయ్యి రాజేసి, ఎసరు పెట్టుకో.’’ అన్నాడు జాలకుడు. భర్త అంత గట్టిగా చెబుతోంటే భార్య కాదంటుందా? ఆమె పొయ్యి రాజేసే పనిలో పడింది. పొయ్యి రాజేస్తున్న తల్లిని చూసి, పిల్లలు సంబరపడ్డారు. ఈ రోజు భోంచేయవచ్చనుకున్నారు.చేపసహా రాజాస్థానానికి చేరుకున్నాడు జాలకుడు. రాజుకి చేపను చూపించాడు.
‘‘బంగారు చేప మహారాజా! వండితే మహా రుచిగా ఉంటుంది, కొనండి, ఆకలితో అల్లాడుతున్న నన్నూ, నా కుటుంబాన్నీ ఆదుకోండి.’’ ప్రార్థించాడు. అంతకు ముందే మహారాజు చాలా చేపలను కొన్నాడు. మర్నాటికి కూడా చేపలు అక్కరలేదు. ఆపైనాటి సంగతి తర్వాత. అందుకని వద్దన్నాడు. వెళ్ళి ఇంకెవరికైనా అమ్ముకోఅన్నాడు. ఆశ ఆవిరై పోయింది. దిగాలు పడ్డాడు జాలకుడు.‘‘మంచి చేప మహారాజా! మహారుచి. దయచేసి ఆలోచించండి.’’ వేడుకున్నాడు జాలకుడు. మహారాజు మౌనం వహించాడు.సరిగ్గా అదే సమయానికి అంతఃపురం కిటికీ నుంచి, అప్రయత్నంగా రాజాస్థానం వైపు చూసింది రాకుమారి ఇంద్రసేన. మహారాజు ముందు మెరిసిపోతున్న చేపను చూసి, ముగ్ధురాలయింది. పెంచుకుంటే అలాంటి చేపనే ఉద్యానవన సరస్సులో పెంచుకోవాలని అను కుంది. పరుగుదీసింది అక్కణ్ణుంచి. ఆస్థానానికి చేరుకుంది.