వెన్నెల చల్లగా హాయిగా ఉంది. మహారాజు ప్రభాకరుడు భార్యసహా డాబా మీద కూర్చుని, తాంబూలసేవనం చేస్తూ, వెన్నెలను ఆస్వాదిస్తున్నాడు. అతనికి సుశీల, సుగుణ, సుమతి అని ముగ్గురు కుమార్తెలు. వారు గుర్తొచ్చారతనికి. గుర్తు రావడమే కాదు, వారిలో తనని ఎక్కువగా అభిమానించేది ఎవరన్నది తెలుసుకోవాలనుకున్నాడతను. అమ్మాయిలను సముఖానికి ప్రవేశపెట్టమని పరిచారికులను ఆజ్ఞాపించాడు. మరుక్షణంలో ముగ్గురమ్మాయిలూ మహారాజు ముందు నిలిచారు. సుశీలకు పద్దెనిమిదేళ్ళు, సుగుణకి పదిహేడేళ్ళు. సుమతికి పదహారేళ్ళు. చూడముచ్చటగా ఉన్నారు ముగ్గురూ. తండ్రి ముందు తలలు వంచుకుని నిల్చున్నారు.‘‘తల్లులూ! నాదో చిన్న ప్రశ్న. మీరు ఆ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పాలి.’’‘‘అడగండి నాన్నా.’’‘‘నేనంటే మీకెంత ఇష్టమో, ఒక్కమాటలో చెప్పండి.’’ అడిగాడు మహారాజు.సమాధానంగా ముందు ఒకరిని ఒకరు చూసుకున్నారు రాకుమార్తెలు.‘‘సుశీలా ముందు నువ్వు చెప్పు?’’‘‘మీరంటే నాకు చాలాఇష్టం నాన్నా! ఎంత ఇష్టం అంటే నా ప్రాణం అంత ఇష్టం.’’‘‘బాగుంది’’ ఆనందించాడు రాజు.‘‘తల్లీ సుగుణా! నువ్విప్పుడు చెప్పు?’’‘‘మీరంటే నాకు అందమైన ఈ ప్రపంచం అంత ఇష్టం నాన్నా.’’ఆ మాటకి గర్వంగా భార్యవైపు చూశాడు మహారాజు.‘‘ఇప్పుడు సుమతి చెబుతుంది. ఏం చెబుతుందో చూద్దాం.’’ అన్నాడు.‘‘చెప్పమ్మా! నాన్నగారు అంటే నీకెంత ఇష్టం?’’ అడిగింది తల్లి.‘‘నాన్నగారంటే... ఊరగాయలో ఉప్పు అంత ఇష్టం.’’ అన్నది సుమతి.
‘‘ఉప్పా? ఉప్పు అంత ఇష్టమా?’’ చీదరించుకున్నాడు మహారాజు.‘‘మళ్ళీ చెప్పు?’’ అడిగాడు.‘‘అదే నాన్నా! మీరంటే నాకు పప్పులో ఉప్పు అంత ఇష్టం.’’ అన్నది సుమతి.‘‘మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?’’ కోపగించుకున్నాడు రాజు.‘‘నన్ను అర్థం చేసుకోండి నాన్నా, నా ఉద్దేశం ఏమిటంటే...’’ అని సుమతి ఏదో చెప్పబోతుంటే...‘‘ఆపు నీ అధిక ప్రసంగం.’’ చేయెత్తి వారించాడు రాజు.‘‘ఎవరక్కడ?’’ పరిచారికుల కోసం కేకేశాడు.‘‘సెలవు మహాప్రభూ’’ ఇద్దరు భటులు వచ్చారు.సుమతిని ఉద్దేశించి రాజు చెప్పాడిలా.‘‘ఈ మర్యాదలేనిదాన్ని, మహారాజుతో మాట్లాడడం చేతకాని దాన్ని వెంటనే నగర బహిష్కారం చెయ్యండి.’’‘‘నాన్నా’’ దిగ్భ్రమ చెందింది సుమతి.‘‘ఏమండీ’’ చేతులు జోడించి నమస్కరిస్తూ అంత కోపం వద్దన్నట్టుగా ప్రార్థించింది భార్య.‘‘తండ్రిని గౌరవించలేని దాన్ని అంతఃపురంలో ఉంచలేను దేవీ! నన్ను ఉప్పుతో పోలుస్తుందా? తగిన శిక్ష అనుభవించాల్సిందే.’’ తెగేసి చెప్పాడు రాజు.