ప్రశాంతంగా, చీమ చిటుక్కుమంటే వినబడేలాంటి నిశ్శబ్దంలో ‘గణగణగణ’ ఫోన్ మోగుతోంది!నిశ్చల ఉలికిపడి లేచింది. అది తను కంటున్నకలని చెరిపేసిన రాక్షసుడి గంటలా అనిపించి కోపంగా ‘‘రేఖా...’’ అని అరిచింది.రేఖ పరుగుపరుగున వచ్చింది. ‘‘ఏమైంది అక్కా?’’ అంది.నిశ్చల కోపంగా ఆగిపోయిన ఫోన్‌కేసి చూపిస్తూ ‘‘నన్ను ప్రశాంతంగా ఉండనీ...దీన్ని తీసి పారెయ్యి’’ అంది.
రాత్రి షూటింగ్‌లో ఆలస్యమైంది. ఆలస్యంగావచ్చి పడుకున్న నిశ్చల తన మొబైల్ ఆఫ్ చేసింది. కానీ లాండ్‌లైన్ విషయం మరచిపోయింది. ఆమె కళ్ళల్లో ఇసకపోసినట్లు మండుతున్నాయి. ఆమె ఒక కొరియోగ్రాఫర్. ఆ ప్రమోషన్ రాగానే నాట్యం చెయ్యడం మానేసింది! వెంటనే కాచుక్కూర్చున్నట్లు, ఆమె శరీరలోకి దయ్యంలా కొవ్వు ప్రవేశించింది. కొద్దిగా డాన్స్ చేసి చూపించినాగానీ ఆమెకు ఒకటే అలసట. శరీరం బరువుకి కాళ్ళు లాగేస్తాయి. కానీ భగవంతుడి దయో, మాయోగానీ సడెన్‌గా రెండుసినిమాలు హిట్ అయ్యేసరికి, పెద్ద నిర్మాతలంతా ఆమెకోసం ఫోన్లు చేస్తున్నారు! పర్సనల్ లైఫ్ చింకిచాటైందని విచారించే లోపే, ప్రొఫెషనల్ లైఫ్ ఊపు అందుకుంది.నిశ్చల కళ్ళుమూసుకోగానే, మళ్ళీ పక్కగదిలో లాండ్‌లైన్ మోత వినపడసాగింది. ఆమె దిండు తీసి చెవులకి గట్టిగా అదిమిపెట్టుకుని పడుకుందాం అనుకుంది.
రేఖ వచ్చి ‘‘అక్కా సారీ....’’ అంది.నిశ్చల కళ్ళు తెరవలేదు.‘‘అర్జెంటుగా మాట్లాడాలంటున్నారు’’ రేఖ చెప్పింది.నిశ్చల కళ్ళు మూసుకునే కార్డ్‌లెస్ కోసం చెయ్యిజాపింది.అరుణ్ గొంతు వినపడింది. ‘‘హాయ్..డిస్టర్బ్ చేశానా?’’‘‘చాలా....’’ కసిగా చెప్పింది.‘‘సారీ...బట్ విషయం అలాంటిది...ఇవాళ లిప్త పుట్టినరోజు. ఈవినింగ్ పార్టీకి నువ్వు రావాలి. ప్లీజ్!’’ అన్నాడు అభ్యర్థనగా.నిశ్చల వ్యంగ్యంగా నవ్వింది ‘‘నీ ఉద్దేశం ఏమిటి అరుణ్? మనం మంచి ఫ్రెండ్స్‌గా డివోర్స్ తీసుకున్నాం. నీ పెళ్ళివల్ల నాకేబాధ కలగలేదని లోకానికి తెలియాలి, ప్రెస్‌వాళ్ళు రాసుకోవాలి! దాన్ని యూ ట్యూబ్‌లో పెట్టాలి, అంతేనా? దానికేగా ఈ అభ్యర్థన?’’ వాడిగా అడిగింది.