మొబైలు రింగైంది. నంబరు కేసి చూసాను పూర్ణది. ఆన్ చేసాను.‘రాత్రి పదైతే కాని నీవు ఇల్లు చేరవని, ఇల్లు చేరితే కాని నీతో తాపీగా మాట్లాడేందుకు వీలుపడదని ఇప్పుడు చేస్తున్నాను’ అన్నాడు పూర్ణ.నిజమే ఆఫీసులో పనిలో ఉండగా, ఎంతటి ఆత్మీయులతోనైనా మాట్లాడేందుకు యిచ్చ గించను.ఏవిటి విశేషాలు. అంతా కులాసాయేకదా అన్నాను.
‘నిన్నో ప్రశ్న అడగాలనుకొంటున్నాను’ అన్నాడు పూర్ణ.‘అడుగు’నీవు మన ఊరు వచ్చి ఎన్నాళ్లైందో గుర్తుందా? వాడి ప్రశ్నలో నాపై ఏదో చిన్నపాటి ‘నింద’ ఉందనిపించింది.మీ నాన్న ‘వీరాస్వామి’ బాబాయి పోయి పదేళ్ళైంది కదూ, అప్పుడు వచ్చాను అన్నాను.మా నాన్న పోయి పదికాదు. పది హేనేళ్ళైంది.అవునా.. అయితే అప్పుడొచ్చాను. ఏదీ ఈ పదిహేనేళ్ళు అమెరికాలోనే ఉండిపోయాను. ఓ ఆరు నెలల క్రిందటే, నన్ను ‘సిలన్’ పంపింది మా కంపెని. ఇక్కడే మా కంపెనీ బ్రాంచి నొక దానిని ప్రారంభించి, దానికి కావలసిన హంగులన్నీ సమకూర్చి పని చేయించే, ప్రయత్నంతో క్షణం తీరికలేకపోయింది. అంతేకాదు మా కంపెనీ, నాకిప్పుడు వైస్ ప్రెసిడెంటుగా పదోన్నతి కల్పించి, వెంటనే ‘కెనడా’ వెళ్ళమని ఎసైన్‌మెంటిచ్చింది.
ఇది ఈనాటి నా పరిస్థితి.ఉద్యోగ ఊర్వసి వెంట పరుగెత్తటంతో మునిగి ఉన్నాను అన్నాను.ఇంకెన్నాళ్ళీ విదేశీ సంచారాలు. నీకు మన ఊరు, మేము గుర్తురామా? చిన్ననాటి మన ఆత్మీ యతలు అనుబంధాలు ఆప్యాయతలు నిన్నువెంటాడవా ‘నీవు పుట్టిపెరిగిన మన జన్మ భూమికి రావాలనిపించదా?‘పూర్ణ ప్రశ్నలు నన్ను ముద్దాయిని చేస్తున్నట్లు ధ్వనించాయి. క్షణకాలం జవాబివ్వలేక ఆగి పోయాక...‘‘అవును రా పూర్ణా... నేను చేస్తున్నది పెద్ద తప్పులానే అనిపిస్తోంది.
చదివిన చదువుకు ఉద్యో గమే సార్ధకతని, ఉద్యోగాల వెంటపడి కొట్టుకుపోతూ మన ‘జనని’ అయిన జన్మభూమిని విస్మరించేటంతటి తప్పే చేసాననిపిస్తోంది. ఎవరెవరికో ‘‘గుడ్ మార్నింగ్’’, ‘‘గుడ్ ఈవెనింగ్’’, ‘‘గుడ్ నైట్’’లు చెప్పుకొంటూ పెనుభూతాల్లాంటి కంప్యూటర్ల పరిష్యంగాలలో బందీలమై పోతూ, అన్యదేశాల సేవలో ఉక్కిరి బిక్కిరౌతూ, ‘‘యన్‌ఆరై’’లమనే ప్రత్యేక జాబితాలో చేరి, పుట్టిన జాతి మూలాలనే మరచిపోయే దశకు చేరుకొన్నాం. సారీరా’ అన్నాను.