‘‘వయసు మీద పడ్డాక విశ్రాంత జీవితం గడపాలని వుండదా?ఎప్పుడూ వాడికేదో ఇబ్బంది వచ్చిందని, వీడికేదో అనారోగ్యం వచ్చిందని కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ ఉంటారు ... ఇంటి పట్టున ఉండరా?’’

ఇంట్లో అడుగు పెట్టగానే వనప్రియ దులిపేస్తున్నట్లు మాట్లాడింది. రెండు నిమిషాలు మౌనంగా వుండిపోతే ప్రశాంత వదనంతో, కాఫీ కప్పుపట్టుకొని వచ్చి మామూలుగా మాట్లేడిస్తుందని తెలుసు.‘వానప్రస్థమా! జనప్రస్థమా! - రెండిటిలో ఏదొకటి కోరుకొమ్మ’ని ఎవరైనా అడిగితే జనం మధ్య వుండటమే ఆనందమని చెప్పేస్తాను. సమూహంలో వుండటమే సరదాగా వుంటుంది. సౌకర్యంగా వుండే ప్రదేశం కంటే సౌజన్యం వెల్లివిరిసే చోటే వుండాలనిపిస్తుంది.‘‘మీ స్నేహితుడు ఫోన్‌ చేశాడు.. మీరేమో సెల్‌ఫోన్‌ ఇంట్లో పడేసి బయట తిరుగుతూ వుంటారు. ఫోన్‌ చేసిన వాళ్ళకు సమాధానాలు చెప్పలేక తలప్రాణం తోక కొస్తోంది’’ అనుకున్నట్లుగానే కాఫీ కప్పుతో వచ్చింది వనప్రియ.‘‘ఎవరూ ఫోన్‌ చేసింది?’’‘‘మీ ప్రాణ స్నేహితుడు .. పవన్‌.’’‘‘ఏం మాట్లాడేడు?’’‘‘మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నాడు.

మీతో మాట్లాడాలట.’’నిరుపేద కుటుంబం నుంచే వాడి జీవిత ప్రస్థానం మొదలైంది. అంచెలంచెలుగా ఎదిగి పెద్ద డాక్టరయ్యాడు. రోరింగ్‌ ప్రాక్టీస్‌తో కోట్లు సంపాదించాడు.‘‘చిక్కడపల్లి వదిలి సిటీకి దూరంగా వుండే విల్లా హౌస్‌కు మారబోతున్నాడట! కొత్త ఇంట్లోకి వెళ్ళే ముందు మీతో ముచ్చట్లు చెప్పాలనేమో.’’వాడిని చూసి రెండు సంవత్సరాలుదాటింది. తనకేదో సన్మానం జరుగుతుందని, రమ్మనమని కబురుచేస్తే వెళ్లానప్పుడు. రెండ్రోజులు వాళ్ళింట్లో వుండి తిరిగి వచ్చేశాను. మళ్ళీ కలవడానికి వీలుపడలేదు.‘‘ఒకసారి మిమ్మల్ని హైద్రాబాద్‌ రమ్మనమని చెప్పాడు’’ మరోసారి చెప్పింది శ్రీమతి.ఎందుకో నాక్కూడా వెంటనే పవన్‌ను చూడాలనిపించింది.

‘‘ఈ రాత్రి హైద్రాబాద్‌ వెళ్తున్నాను’’ చెప్పేశాను.‘‘లేడికి లేచిందే ప్రయాణమన్నట్లు, మీ స్నేహితుడు ఫోన్‌ చేశాడని చెప్పగానే బయల్దేరడమేనా?’’‘‘మైడియర్‌ ప్రియా ... నువ్వు కూడా నాతో రారాదూ?’’‘‘నాకెలా కుదురుతుంది? మనవళ్ళు, మనవరాళ్ళు ... నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేరు. రేపు సాంబయ్యగారి అమ్మాయి పెళ్లి... దగ్గరుండి అన్నీ చూసుకోవద్దూ! ‘వదినా, నువ్వు పక్కన లేకపోతే నాకు కాలూ చెయ్యీ ఆడద’ని సాంబయ్య భార్య మరీమరీ చెప్పింది. మనింట్లో అద్దెకుండే అమ్మాయి ప్రసవించింది గదా. తనకి పసిపిల్లకు స్నానం చేయించడం చేత కాదు. నేనే చేయించాలి. రేపు మీ పెద్ద మనవరాలి పుట్టినరోజు. అనాథాశ్రమం వెళ్ళి అక్కడ పుట్టినరోజు వేడుక జరపాలి. అబ్బ.. ఎన్ని పనులో.. మీతో పాటు ఊళ్ళు తిరగడానికి నాకెలా కుదురుతుంది?’’