పుట్టి బుద్దెరిగినప్పటినుంచి మా బంధువుల్లో నాకు అతి దగ్గరగా ఉండే మనిషి, నాకు తెలిసినవాడు మా ఇంట్లోనే ఉండేవాడు ఒక వృద్ధుడు. అతడు మా తాతకి తమ్ముడు. నాకు చిన్నతాత. పేరు శివుడు. మా నాన్న అతడిని ఎంతో ఆదరంగా అచ్చం తండ్రిలాగ చూసుకునేవాడు. అందుకే మా చిన్నతాతకి మా నాన్నంటే ఇష్టం.
మాది చిన్నరేకుల ఇల్లు. ఆ పక్కన పెద్ద పెచ్చులూడి శిధిలమైపోయిన గోడ. ఒకసారి వర్షంవచ్చినప్పుడు గోడ కూలిపోయింది. ఆ గోడని ఆనుకుని బందిలిదొడ్డి. పేరుకు బందిలిదొడ్డేగానీ, అక్కడ పశువులేమీ ఉండేవి కావు. ఎప్పుడైనా ఎవరిదైనా ఎద్దుగానీ, ఆవుగానీ ఇంకొకరిపొలంలో మేస్తుంటే దానిని పట్టుకొచ్చి అక్కడ కట్టేసేవారు. పంచాయితీ వేసిన పన్ను కట్టేస్తే వాటిని విడిచిపెట్టేసేవారు. సుమారుగా బందిలిదొడ్డిని ఆనుకుని ఉన్నగది ఖాళీగా ఉండేది. దాంట్లోకి మా ఇంటి కుడిపక్కనుంచి దారి ఉండేది. అందులో ఉండేవాడు మా చిన్నతాత.మా తాత నాకు తెలియదు.
నేను పుట్టక మునుపే చనిపోయాడు. కాని మా చిన్నతాత నాకు బాగా తెలుసు. అతడు ఒక విచిత్రమైన మనిషి అని అందరూ అనుకునేవారు. ఆ విచిత్రం ఏమిటో అప్పుడు నాకు బోధపడలేదు. కాని కాలంగడుస్తున్నకొలదీ అర్థమైంది.మా చిన్నతాత మిల్లులో పనిచేసేవాడు. మిలుల్లో అన్నిపనులూ తెలుసు. అప్పటిమిల్లులు ఇప్పుడులాంటివి కాదు. అంతా ఒకట్రెండు మోటర్లమీద పనిచేస్తూ గరగరమంటూ గీ పెట్టేవి. ఒక పక్క ధాన్యం ఆడేవారు. మరోపక్క సాయంత్రంవేళ పిండి ఆడేవారు. గల్లాలో ధాన్యంవేసింది మొదలు చివరకు బియ్యం బయటకు వచ్చేవరకు అన్నిరకాలపనులు మా చిన్నతాత చూసుకునేవాడు.
సాయంత్రం అన్నిరకాల పిండి ఆడించి, ఒక పిండిబొమ్మలా తయారై బూచాడులా ఇంటికి వచ్చేవాడు. ఆ విధంగా మా చిన్నతాతను చూస్తే నాకు భయం వేసేది. ఆ భయం పోగొట్టడానికేనేమో నాకు తెలియదు, నా చేతిలో కొబ్బరుండలు, కజ్జిపుండలుపెట్టేవాడు. కాటుబెల్లం కొనుక్కోవడానికి డబ్బులిచ్చేవాడు. తను సంపాదించిన డబ్బులు పంచెలోమూటకట్టి దాచి ఉంచుకునేవాడు. అప్పుడప్పుడు అమ్మకి కూరలు కొనమని ఇచ్చేవాడు. ఎప్పుడూ ఆకలి అనేవాడు. పెట్టిన అన్నం పెట్టినట్లు తినేసేవాడు. ఇంకా సరిపోక మళ్లీమళ్లీ వేయించుకునేవాడు. కుండలో ఆఖరిమెతుకు కూడా వదిలేవాడు కాదు.