నియాన్ లైట్ల వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతోంది బీచ్ రోడ్డు. రాత్రి పదకొండు కావస్తుండడంతో ఒకటీ అరా వాహనాలు తప్ప, జనసంచారం పెద్దగా కనబడట్లేదు.సముద్రపుటొడ్డున, ఇసుకమీద, చిక్కగా చీకటి పరుచుకున్న చోట ఒంటరిగా కూర్చొని దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉన్నాడు శశాంక.అమావాస్యరాత్రి కావడంతో, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలతో, పిశాచాల సంగీతం వంటి భయంకరమైన హోరుతో భయం గొలిపేలా ఉంది బంగాళాఖాతం.అయితే .. లోతైన ఆలోచనాసాగరంలో మునిగిపోయిన శశాంక అటు సముద్రాన్నిగాని, ఇటు అది గావిస్తున్న సంగీత కచేరీనిగాని గమనించే స్థితిలో లేడు. తనకు మనశ్శాంతి లేకుండా వేధించుకు తింటున్న జటిలమైన సమస్యకు పరిష్కారం వెతుక్కునే పనిలో నిమగ్నమై ఉన్నాడు.ఇంటికి తిరిగి వెళ్ళాక, తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మతో ఏం మాట్లాడాలీ, ఎలా మాట్లాడాలీ, తను తీసుకున్న నిర్ణయాన్ని ఆమెకు బాధ కలగకుండా, నేర్పుగా ఎలా తెలియజెయ్యాలీ... అసలు చెప్పాలా వద్దా... అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నాడు.శశాంక ఎదుర్కొంటున్న సమస్య నిన్నో మొన్నో అకస్మాత్తుగా పుట్టుకొచ్చినది కాదు. అతనికి పాతికేళ్ళ వయసు వచ్చినప్పట్నుండీ, అంటే ఇంచుమించు నాలుగేళ్ళ నుండీ తల్లీ కొడుకులు ఇద్దరి మధ్యా నలుగుతున్న విషయమే అది. అరవింద ఆ విషయం ప్రస్తావించిన ప్రతీసారీ ఏదో ఒకటి చెప్పి, అసలు విషయం చెప్పకుండా దాటవేస్తున్నాడు.దాంతో విసిగిపోయిన అరవింద ‘ఇలాంటి తిక్కవేషాలేస్తే ఇక ఊరుకునేది లేదనీ, అసలు నీ ఉద్దేశం ఏంటో, ఏం చెయ్యదలచుకున్నావో, రేపటిలోగా చెప్పి తీరాలనీ, చెప్పకపోతే ఏం చెయ్యాలో నేనే నిర్ణయిస్తాననీ’ అల్టిమేటం జారీ చేసింది.అంతేకాకుండా ‘‘ఆ నిర్ణయమేదో నేనే తీసుకుంటే అదెలా ఉంటుందో నీకు తెలుసు కదా?’’ అని కూడా అంది చూపుడు వేలు అటూ ఇటూ ఆడిస్తూ... కోపంగా!అప్పటికి సరేనంటూ తల ఊపేడుగాని, ఎప్పుడో చాలా కాలం క్రితమే తను తీసుకున్న నిర్ణయాన్ని గురించి తల్లికి కలవరపాటు కలిగించకుండా, సున్నితంగా ఎలా చెప్పాలో ఎంత ఆలోచించినా స్ఫురించట్లేదు. అందుకే అంత రాత్రి అయినా, ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక, బీచ్‌లో కూర్చున్నాడు పరిష్కారం ఆలోచిస్తూ.
*************************************************************