నాతిచరామి అంటూ వాగ్దానంచేసిన సహచరుడి మరణంతో ఆమె, ప్రాణమిత్రుడు వీడిపోయాడన్న అవేదనతో అతడూ విలవిలలాడిపోతున్నారు. అతడింకా కాస్తంత నయం. జ్ఞాపకాల్లో బతుకుతున్నాడు. కానీ ఆమె...జీవన సహచరుణ్ణి కోల్పోయింది. ఇద్దరు కొడుకులున్నా మానసికంగా ఒంటరైపోయింది. ముందు ముందు జీవన సమరం ఎలా....? ఆమె ఎన్నుకున్న దారేంటి? అతడిచ్చిన సలహా ఏంటి?

రాత్రి పదిగంటల సమయం....టీ.వీ కట్టేసి పండుకుందామని కుర్చీలోంచి లేస్తుంటే సెల్‌ మ్రోగింది.సుదర్శనం సెల్‌ నుంచి అతని భార్య జానకి మాట్లాడింది.సుదర్శనానికి మధ్యాహ్నం నుంచి వాంతులు విరోచనాలట. ఏదో మాత్రవేసుకున్నాట్ట. అరగంటక్రితం మళ్ళీ వాంతయిందంట. కళ్ళు తిరిగి పడిపోయాడని జానకిచెప్పిన సమాచారం అర్థాంగికి తెలియజేశాను.ఇద్దరం బట్టలు మార్చుకుని సుదర్శనం ఇంటికి బయలుదేరాం. సుదర్శనం ఇల్లు మా ఇంటికి దగ్గరే. సుదర్శనాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లే ఉద్దేశ్యంతో కారు తీశాను.సుదర్శనం ఇంటికి చేరేసరికి అతను మాట్లాడలేనిస్థితిలో ఉన్నాడు.జానకితో ఆలోచించి గుడ్‌హెల్త్‌ కార్పొరేట్‌ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలని నిర్ణయించాం. ముగ్గురం కలిసి సుదర్శనాన్ని లేవదీసి అతని చేతులు మా భుజాలపై వేసుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టాం.

మరో అరగంటలో గుడ్‌హెల్త్‌ హాస్పిటల్‌ చేరుకున్నాం.నగరంలోని ప్రముఖ కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో అదొకటి.పరుగుపరుగున వెళ్ళి నర్సుని పిలుచుకొచ్చా.మరో పావుగంటలో సుదర్శనాన్ని ఐ.సి.యు.లోకి తరలించారు.వెంట తెచ్చిన పదివేల రూపాయలు కౌంటర్లో కట్టాం.విజిటర్స్‌ లాంజ్‌లో టెన్షన్‌తో నిలబడ్డాం.అరగంట నిరీక్షణ తరువాత డాక్టర్‌ మమ్మల్ని తన రూమ్‌కు పిలిపించి, పేషెంట్‌ ఆరోగ్యపరిస్థితి సీరియస్‌గా ఉందని, బి.పి, సుగర్‌ లెవెల్స్‌ పడిపోయాయనీ చెప్పాడు. పేషెంట్‌ డయాబెటిక్‌ కనుక అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు చెప్పాడు.

కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్నట్లు లేవనీ, చాలా టెస్ట్‌లు చేయాలనీ, మరో పాతికవేలు వెంటనే కౌంటర్లో కట్టమనీ సలహా ఇచ్చాడు.ఎ.టి.ఎం. కార్డు జేబులో ఉంది కనుక క్యాష్‌ సమస్య రాలేదు. డబ్బు డ్రా చేసి డాక్టరు చెప్పినట్టే చెల్లించాం.‘‘మీరు రాత్రి ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. అవసరమైన ట్రీట్‌మెంట్‌ మేం కొనసాగిస్తాం. అత్యవసరం అనుకుంటే సెల్‌ ద్వారా తెలియజేస్తాం. మీరు ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోండి’’ అని చెప్పాడు డాక్టర్‌. జానకికి కన్నీళ్ళు ఆగడంలేదు. నా భార్య శాంతి జానకిని ఓదార్చసాగింది. సుదర్శనం కొడుకులిద్దరికీ ఫోనుచేసి విషయం వివరించాను.