వాడిన పువ్వు రాలినట్టు, ఎండిన ఆకు రాలిపడిపోయినట్టు, ఆకాశంలోంచి వేగంగా దూసుకొచ్చిన నక్షత్రం మౌనంగా నేలనుతాకి తరించినట్టు...మరణం నిశ్శబ్దంగా జరిగిపోవాలి. మరణానంతరం ఏం జరుగుతుందో ఇదమిత్థంగా ఇప్పటివరకు ఎవరూ చెప్పలేకపోయారు, అందుకే జీవితాన్ని ఆస్వాదించాలి, మన కుటుంబానికి ప్రేమ పంచాలి అని భార్యకు చెప్పాడతను. మరి ఆమె పాటించిందా?
తెల్లావారి ఆరు గంటలు అవుతోంది. తూర్పున బాలభానుడు నిద్రలేద్దామా వద్దా అని తటపటాయిస్తున్నాడు. చక్రవర్తి మాత్రం తెల్లవారే తన కాలకృత్యాలు పూర్తిచేసుకుని సైకిల్ బయటకు తీశాడు. వారం, పదిరోజులకు ఒకసారి అతను మార్కెట్‌కెళ్లి కూరగాయలు, పండ్లు తీసుకుని రావడం ఆనవాయితి. భార్య బాలసరస్వతి అతనికి కావలసిన సంచి అందిస్తూ షరా మామూలుగా భర్తను హెచ్చరించిందిఇంత చలిలో ఆ సైకిల్ ఎందుకు స్కూటర్‌పై పోవచ్చు కదా.‘‘ఓసి పిచ్చిదానా, మనలోని అనారోగ్యం ‘సై’ అని సవాలు చేస్తే, దాన్ని ‘కిల్’ చేసేదే ఈ సైకిల్. దీన్ని వద్దంటావేమిటి’’ నవ్వాడు చక్రవర్తి.‘‘సరేసరే మిమ్మల్ని ఎవరూ మార్చలేరు., వాదించనూ లేరు. మార్కెట్ అంతా కొనితేవద్దు. అందుకే అమ్మాయి సలహా పాటించి మీ జేబులో కేవలం వందరూపాయలే పెట్టాను దానికి ఏం వస్తాయో అవే తీసుకురండి’’ భార్య సలహా ఇచ్చింది.
చక్రవర్తి తలాడిస్తూ సైకిలెక్కి గేటు బయట ఆగి భార్యనుచూసి నవ్వాడు. ‘‘నిన్న నీ కూతురు ఫోనలో ఇచ్చిన సలహా నేను విన్నాను. అందుకే నా జాగ్రత్తలో నేను ప్యాంటు జేబులో మరో రెండువందలు పెట్టుకున్నాను’’ అంటూ సైకిల్‌పై తుర్రుమన్నాడు.బాలసరస్వతి ఆశ్చర్యంతో, చిరుకోపంతో వెనుకనుంచి భర్తను అలాగే చూస్తూ నిలబడింది. అతనికి 64 సంవత్సరాలు. పదవీవిరమణ చేసి నాలుగేళ్ళయినా, ఇరవైఏళ్ళముందు ఎంత ఉత్సాహంతో మార్కెట్‌కు వెళ్ళేవాడో ఇప్పుడూ అంతే.మార్కెట్‌లోకి వెళితే అతనికి ఒళ్లు తెలిలియదు. కనబడిన ప్రతికూరగాయ, ఆకుకూర నవనవలాడుతున్నవి ఏరుకుంటాడు. ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్‌కి వెళుతున్నాడు కనుక మార్కెట్‌లో అందరితో పరిచయం ఉంది. అంగడివాళ్ళందరూ పలకరిస్తారు. ఆయనకొనే ఉత్సాహానికి పగ్గాలు వేసేందుకు ఆమె కూడా అప్పుడప్పుడు మార్కెట్‌కు వెళుతుంది. అతని పరిచయాలు చూసి ఆశ్చర్యపోతుంది.