అర్థరాత్రి పన్నెండు దాటింది. పరదేశీపాలెం పోలీస్‌స్టేషనులో ఫోన్‌ మోగింది.కునికిపాట్లు పడుతున్న రైటర్‌ అప్పలరాజు ఫోన్‌ ఎత్తాడు. ఫోన్‌లో సమాచారం వినగానే అతడి ముఖంలో రంగులు మారాయి.పక్కనే ఉన్న ఎస్‌.ఐ. వీరభద్రం ‘‘ఏమైంది?!’’ అన్నాడు.

‘‘మళ్ళీ ఇంకో ఫోన్‌ సార్‌ పాతగాజువాకలో ఒక ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయంట, తలుపులు కొట్టుకోవడం, సామాన్లు పడిపోవడం....’’ అన్నాడు.‘‘దెయ్యాలైతే మనకెందుకు ఫోన్‌...?! ఏ మంత్రగాడికో సిద్ధాంతికో ఫోన్‌ చెయ్యాలిగానీ’’ విసుగ్గా అన్నాడు ఎస్‌.ఐ.‘‘అంటే అవి నిజంగా దెయ్యాలా? లేక కావాలని ఎవరైనా అలాంటి చేష్టలు చేస్తున్నారా?! అనే అనుమానమట సార్‌’’ అన్నాడు రైటర్‌.అయితే నిన్న నాకూ ఒక ఫోన్‌ వచ్చింది. ‘‘రోజూ రాత్రి జీవితాంతం–జీవితానంతరం’’ సీరియల్‌ వచ్చే టైములోనే ఇవన్నీ జరుగుతున్నాయట అన్నాడు ఎస్‌.ఐ.‘‘ఔను సార్‌...నేనూ విన్నాను. మా ఆవిడ, మా అమ్మాయి ఇద్దరూ ఆ సీరియల్‌ చూస్తారు. మరి అయితే మా ఇంట్లో దెయ్యాల హడావుడేమీ లేదు’’ అన్నాడు రైటర్‌.

‘‘ఔను. మా ఇంట్లోనూ ఆ సీరియల్ చూస్తారు. ఈ దెయ్యాలసందడి మాకూ ఏమీలేదు’’ అన్నాడు ఎస్‌.ఐ.‘‘అయితే ఈ సీరియల్‌కు, దెయ్యాల అలికిడికి ఏదో లింకు ఉంది. దీనిమీద పరిశోధించాలి, ‘‘ఔను, ఆ పని వేగిరం చెయ్యాలి’’ అన్నాడు రైటర్‌ మాటలతో ఏకీభవించి. తరువాతిరోజు రాత్రి టీవీ 19 ఛానెల్‌ చూస్తున్న వీరభద్రం హఠాత్తుగా టీవీలో వస్తున్న ఒక కార్యక్రమంకేసి దృష్టి సారించాడు. ఒక మహిళా యాంకర్‌, ఒక ఐదేళ్ళ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తోంది.‘‘చూశారా ఈ అద్భుతం. పూర్వజన్మ అంటే నమ్మనివారిని నమ్మేలాచేసే ఈ అపూర్వసంఘటన! ఈ ఐదేళ్ళ అమ్మాయికి తన పూర్వజన్మ గుర్తుకొచ్చింది. ఆ విషయం బ్రేక్‌ తర్వాత...’’ అంది.