‘‘ఏయ్‌ మేరే వతన్‌ కే లోగోజర ఆంఖ్‌ మే భర్‌లో పానీజో షషీద్‌ హై ఉన్‌కీజర యాద్‌ కరో కుర్బానీ’’ఈ అమర దేశభక్తి గీతం శ్రావ్యంగా చెవుల్ని తాకుతుంటే మనసు పులకరించింది.ఆగస్టు 15, జనవరి 26 వంటి తేదీలలో అరుదుగా వినిపించే అలనాటి ఆణిముత్యం ఈ పాట.‘దేశ సరిహద్దుల్ని శత్రువులనుండి కాపాడుతూ, తమ ప్రాణాల్ని పణంగాపెట్టి, దేశ ప్రజలకు భద్రత కలిగించే సైనికసోదరుల వీరత్వాన్నీ, త్యాగాన్నీ హృదయపు లోతుల్లోకి చొచ్చుకు పోయేలాచేసే శక్తివంతమైనదీ పాట. అందుకే ఎన్ని తరాలు గడచినా సజీవంగానే ఉంది.

కారు నవ్యభారతి స్కూలు ముందాగింది. కారు దిగాను. ఎటుచూసినా పిల్లలు. అద్దంలాంటి అమాయకత్వంతో, కురిసే వానలా, నడిచే కవిత్వంలా,కల్మషం లేని ఆ పసిడి మొహాల్ని చూస్తుంటే, గుండెలమీద ఎవరో అమృతం చిలకరించినంత హాయిగా అనిపించింది. స్వచ్ఛమైన వాళ్ళ నవ్వులు వింటుంటే, వాళ్ళ హాసాల్ని లాలిస్తూ హాయిగా నవ్వుకోండని ప్రకృతి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినట్టనిపించింది. గాలి మోయలేనన్ని ఆనందాల పరవళ్ళు, వాళ్ళ మొహాల్లో కేరింతల మధ్య కెరటాల్లా కన్పిస్తున్నాయి. యూనిఫాం దుస్తుల్లో బారులుతీరి బాలసైనికుల్లా నిలబడ్డ ఆ భావిభారత ఆశాదీపాల్ని చూస్తుంటే, నాలోని రచయితకి భావోద్వేగం కలిగింది.

ఆగస్టు 15న తను నడుపుతున్నస్కూలు వార్షికోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా, జెండా ఎగురవేసి, ఉపన్యసించవలసిందిగా మిత్రుడు మురళి నన్ను ఆహ్వానించగానే, ‘‘రాజకీయ నాయకులకు బదులు ఒక రచయిత జెండా ఎగురవేయడమేమిటి?’’ అన్నాను ఆశ్చర్యంగా.‘‘విద్యార్థులకు రాజకీయాలు అనవసరం కాబట్టి’’ అన్నాడు తడుముకోకుండా.కారు దిగిన నన్నుచూసి మురళి ఎదురొచ్చి బొకే ఇచ్చి లోపలికి తీసుకెళ్ళాడు.‘‘సారే జహాస్‌ అచ్చా, హిందూ‍స్తాన్‌ హమారా...’’ పాట శ్రావ్యంగా వినిపిస్తోంది. పాటకి అనుగుణంగా పిల్లలంతా క్రమశిక్షణతో కవాతులు చేస్తున్నారు.