బెలగాం సెంటర్ ఆవు పొదుగైతే చుట్టూ వీధులన్నీ కమ్మని గుమ్మపాలు కురిపించే ‘సిరలు’. దేని ప్రత్యేకత దానిదే.. ఎక్కడి సందళ్ళు అక్కడివే. కానీ, అగ్రహారం వీధి ప్రత్యేకత వేరు. వసంత నవరాత్రుల్లో హరికథలు, సీతారాముల కల్యాణాలు, అన్నదానాలు, బళ్ల వేషాలు, కృష్ణాష్టమి ఉట్ల సంబరాలు, దసరాల్లో జై బేతాళా కర్రసాములు, పులివేషాలు, అంబుజమ్మగారి బొమ్మల కొలువులు, దీపావళి సిసింద్రీలు, తారా పందాలు, చలికాలం బోగీ మంటలు- వీధి మొత్తానికి ఇవన్నీ ఒకెత్తు.. ‘జిల్ జిల్’ కిష్టప్ప ఒకెత్తు..!
ఎప్పటి మాట! యాభై ఐదేళ్ళ వెనకటి సంగతి.వీధి మొదట్లో ఎడమవైపు బాపిరాజుగారి మేడ మీద సబ్-రిజిస్ట్రార్ లో పనిచేసే కొమరాడ రామ్మూర్తిగారు అద్దెకు ఉండేవారు. బహు దొడ్డ మనిషి. ఉత్తరం వాటాలోని ఆ ఇంటి తలుపు తెరవగానే అంతెత్తున కనిపించే వారు. ‘‘ఎవరు కావాలి బాబూ?’’ అని అడిగేవారు. తెలిసిన మొహమే అయితే, ‘‘ఒరేయ్ కిష్టప్పా..’’ అని వీధి బాల్కానీలో పిట్టలతో, పిల్లులతో ఆడుకుంటున్న కొడుకుని కేకేసి, ఫలానా వాళ్ళబ్బాయి వచ్చాడని చెప్పేవారు. ఆ రోజు శనివారం అయితే మట్టుకు రామ్మూర్తిగారు మాట్లాడేవారు కాదు. సైగలు చేసేవారు. చాన్నాళ్ళ క్రితం శనివారంనాడు ఆయన శ్రీమతి చనిపోయారట.
అర్ధాంగి మీద ప్రేమతో ఆయన రెండో పెళ్ళి చేసుకోలేదనీ, ప్రతీ శనివారం మౌన వ్రతం పాటిస్తారనీ ఆ రోజుల్లో చెప్పుకునేవారు. కొడుకు కిష్టప్పకీ, కూతురు సుగుణమ్మకీ ఆయనే తల్లీ తండ్రీ! మనిషి గంభీరం. మాట నిదానం.కొడుకు కిష్టప్ప ఉన్నాడే, తండ్రిగారికి పూర్తిగా విరుద్ధం. వాడో సరదాల పుట్ట. బుర్ర నిండా జోకులే. ఎలాంటి వాళ్ళనైనా ఇట్టే ఆటపట్టించే వాడు. కిష్టప్ప వీధిలోకి ఎప్పుడొస్తాడా అని కుర్రాళ్ళంతా ఎదురుచూసేవాళ్ళు. ఎంతమంది అభిమానులో! ప్రతీ ఇంట్లోనూ స్నేహితులే. ఓలేటివారి నాగులు, బండారువారి తమ్మన్న, గాజుల వాళ్ళ పండరి, బోడపాటివారి సత్యం, గొల్లపూడివారి రామం- ఇలా ఒకరా? ఇద్దరా? వీధిలో కుర్రాళ్ళంతా కిష్టప్ప చుట్టూ చేరిపోయేవాళ్ళు. ఏం వింతలు చెప్తాడా? ఎలాంటి విశేషాలు చూపిస్తాడా? అని కళ్ళింతలు చేసుకునే వాళ్ళు. కిష్టప్పకి ఓ గమ్మత్తైన అలవాటుండేది. కొత్త సంగతి చెప్పినా, గమ్మత్తు చూపించినా ముందస్తుగా ‘జిల్..జిల్’ అనేవాడు. అలా అన్నాడంటే వింతో, విశేషమో ఉందన్నమాటే!