అమెరికాలో మనవరాలు ఓ తెలుగు యువకుడిని ప్రేమించింది.. వివరాలు చెప్పింది. పెళ్లి సంబంధం గురించి మాట్లాడేందుకు ఆ యువతి తాతయ్య.. ఆ యువకుడి ఇంటికి వెళ్లాడు.. ‘మా అమ్మాయి.. మీ అబ్బాయి ప్రేమించుకున్నారు..’ అంటూ అసలు విషయం చెప్పాడు.. అప్పుడే ఆ ఇంట్లో ఒకామె కనిపించింది.. ‘మా అమ్మ’ అంటూ ఆ యువకుడి తండ్రి పరిచయం చేసిన ఆ మెను చూసి.. అతడికి షాక్.. ఆమె ఎవరో..? గుర్తుకొచ్చి.. నోట మాట రాక.. అసలేం జరిగిందంటే..
*****************

‘‘మన సూరిపండు ఇవాళ రాలేదు?’’ రాఘవ ప్రశ్నార్థకంగా అన్నాడు.‘‘నిన్న మీరిద్దరూ రాలేదు. తను విశాఖపట్నం వెళుతున్నట్టు చెప్పాడు’’ కోటి అన్నాడు.‘‘విశాఖ? ఎందుకు?’’ ప్రశ్నించాడు విశ్వం.‘‘వెళుతున్నానని చెప్పాడు. ‘ఎందుకు?’ అని అడుగుదామనుకున్నానుగానీ, ఒకవేళ తను వెళ్లిన పని అవకపోతే ప్రశ్నించినందుకు నన్ను వేధించుకు తింటాడని భయమేసి అడగలేదు!’’ అన్నాడు కోటి.

 

‘‘నేను బయటికి వెళుతున్నప్పుడల్లా, ‘ఎక్కడికీ, ఎందుకూ?’ అని నా శ్రీమతి తప్పక అడుగుతుంది!’’ అన్నాడు రాఘవ.‘‘అలా అడగడం చాలామందికి నచ్చదు. అడిగితే వెళ్లిన పని కొండెక్కుతుందని అదోరకమైన నమ్మకం!’’ అన్నాడు కోటి.‘‘నిజమే అనుకో. ప్రతినిత్యమూ ఆఫీసుకు వెళుతున్నాగానీ, రోజూ ఆఫీసుకు వెళుతున్నానని చెప్పాలి. ఆఫీసు నుంచి వేరే ఆఫీసుకు వెళితే, ఆ సంగతి ఫోన్‌చేసి చెప్పాలి!’’ అన్నాడు రాఘవ.‘‘ఏం ఎందుకట?’’ విశ్వం ప్రశ్నించాడు.‘‘నా శ్రీమతి తర్కం వేరు! ఆలస్యంగా ఇంటికి వస్తానని కారణంతో సహా ఫోన్‌ చేసి చెప్పకపోతే, చేరాల్సిన సమయానికి ఇంటి గడప తొక్కకపోయినా, ఆవిడకి చాలా భయంకరమైన ఆలోచనలు వచ్చేస్తాయి. లుంబినీ పార్క్‌ దగ్గర తీవ్రవాదుల విస్ఫోటనాలూ, ట్యాంక్‌బండ్‌ మీద రోడ్డు ప్రమాదాలు, గతకాలపు జ్వాలలతో పునఃపరిచయాలు వగైరా, వగైరా!’’ అన్నాడు రాఘవ నవ్వుతూ.

‘‘కొంపదీసి సూరిపండు కూడా విశాఖ వెళ్లింది అందుకేనేమో?’’ అన్నాడు విశ్వం.‘‘రేపు తిరిగి వచ్చేస్తానన్నాడు. అంచేత నీ అభిప్రాయం సరికాపోవచ్చు!’’ అన్నాడు కోటి.ఆ మర్నాడు విశాఖ నుంచి తిరిగి వచ్చిన సూర్యారావనే సూరిపండు స్నేహితులందరికీ ఫోన్‌ చేసి, ‘ఎగనామం పెట్టకుండా సాయంత్రం ఆరింటికి ముచ్చట్ల మందిరానికి తప్పకరండి’ అని ఒకటికి రెండుసార్లు చెప్పాడు. సూరిపండుకి నౌకాదళంలో కొందరు స్నేహితులున్నారు. వాళ్లు ఏడాదికి ఒకటి రెండుమార్లు ఏదో సందర్భంలో విదేశీ మద్యం సీసాలు బహుమతిగా ఇస్తుంటారు. సూరిపండు వాటిని స్వార్థంతో తన స్వంతానికే ఉపయోగించుకుండా నలుగురుతోనూ నాలుగు కబుర్లు చెప్పుకొంటూ సేవనం చేసేస్తాడు.