పూర్వం ఒకానొక గ్రామంలో శివానందుడనే పేదరైతు ఉండేవాడు. అతడికి ముసలి తల్లిదండ్రులు, భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.ఊళ్లో రైతులందరికీ పంట బాగానే పండేది. అతడికి మాత్రం ఎంత కష్టపడినా పొలంలో పంట దిగుబడి తక్కువగా ఉండేది. పండిన దాంట్లో సగం పన్నులు కట్టడానికే సరిపోయేది. మిగతాసగంతో పాత అప్పులు తీరేవి, దినఖర్చులకోసం కొత్త అప్పులు చేసేవాడు శివానందుడు.
ఇలా ఉండగా, శివానందుడి తండ్రికి జబ్బుచేసింది. వైద్యుడు పరీక్షించి చూసి, ‘‘జబ్బు నిజంగా ప్రమాదకరమైనది కాదు. కానీ మందులు ఖరీదైనవి. నూరు వరహాలిస్తేతప్ప మందులు తయారు చేయలేను. వారం రోజుల్లోగా మందులివ్వకపోతే, నీ తండ్రి ప్రాణానికి ప్రమాదం’’ అని చెప్పాడు.డబ్బుకోసం శివానందుడు ఊరంతా తిరిగాడు. అతణ్ణి ఆదుకునేందుకు ఊళ్ళో ఎవరూ సిద్ధంగా లేరు. ఆ విషయం తల్లికి చెప్పుకుని ఏడ్చాడు శివానందుడు. తల్లి విచారంగా, ‘‘నాయనా, ఏడవకు. నిన్ను ఏదో దుష్టగ్రహం పట్టుకుని పీడిస్తోంది. ఏం చేసినా మనకి కలిసిరావడంలేదు. ఇక నాకొక్కటే ఉపాయం తోస్తోంది. మన ఊరిని ఆనుకుని ఉన్న అడవిమధ్యలో కాళికామాత ఆలయం ఉన్నది.
అక్కడున్న కాళీమాతను దొంగలు, ధూర్తులవంటివారే అర్చించి, ఎన్నో ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. మంచివాడివి, నిన్ను ఆ దేవి తప్పక అనుగ్రహిస్తుంది. ఆ మాతను దర్శించుకుని రా. నీకు పట్టిన దుష్టగ్రహం పారిపోతుంది. మనకు మళ్లీ మంచి రోజులొస్తాయి’’ అని సలహా ఇచ్చింది.శివానందుడు మరో ఆలోచన లేకుండా కాళీమాత ఆలయానికి బయలుదేరాడు. అతడు అరణ్యం చేరుకునేసరికే చీకటి పడింది. అయినాసరే, ఆగకుండా ధైర్యంగా ముందుకెళ్లాడు. దారిలో ఎదురైన కొండచిలువల్నీ, విషసర్పాల్నీ తప్పించుకుంటూ, క్రూరమృగాలకంట పడకుండా - ఎలాగైతేనేం, అర్థరాత్రి సమయానికి ఆలయం చేరుకుని ఆలయంలో ప్రవేశించాడు.