సినిమారంగం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. బీటెక్‌లో ఆర్కిటెక్చర్ చదివి ఓ గొప్ప సినిమాకి ఐదేళ్ళు కష్టపడి అద్భుతమైన సెట్లు తయారు చెయ్యడానికి ఎంతో కృషి చేసింది. టైటిల్స్‌లో తనపేరు పడితే పడ్డశ్రమ మరచిపోదామనుకుంది. కనీసం డబ్బులైనా ముడతాయనుకుంది. కానీ ఆమె కల నెరవేరలేదు. ఐనా నిస్సహాయురాల్లా ఉండిపోలేదామె. తన బాధ అందరికీ ‘చెప్పు’ కుంది. అలా ‘చెప్పు’ కోవడంవల్ల ఆమెకేం ఒరిగింది?
*********************
‘‘నీకిప్పుడు రెండున్నరలక్షలు ఎక్కడినుండి తీసుకురానే? ఏదో ఆర్కిటెక్చర్ చదువుతానంటే తలతాకట్టుపెట్టి చదివించాను. అందరు ఆడపిల్లల్లా ఉద్యోగాలు చేయకుండా, పోనీ పెళ్ళిచేసుకుని పోకుండా, ఈ సినిమాలకి పనిచేస్తాననే పిచ్చేమిటే? ఆ పని చెయ్యడానికి ఇంత డబ్బు కట్టి కార్డు తీసుకోవడం ఏమిటి?’’ అసహాయత, అసహనం రెండూ కలిసి, కోపంతో ఊగిపోయాడు రామ్మూర్తి. బీ.పీ. కూడా పెరిగింది.ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. పై ఇద్దరూ ఇంజనీరింగ్ చేసి, ఆయన చూపించిన సంబంధాలు చేసుకుని, కడుపు కట్టుకుని తండ్రి చదివించిన చదువుతో మొగుడికి సంపాదించి పోస్తూ హాయిగా ఉన్నారు. ఈమూడోది హారిక ఆయనకి కొరకరానికొయ్యగా తయారైంది. ‘‘దానిలో కళ ఉందండీ...దాన్ని చెయ్యనివ్వండీ...అందరూ ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తేనే సంపాదిస్తున్నారా?’’ అంటూ దానికి పెళ్ళాం సపోర్టొకటి!నిజమే అనుకుని ఊరుకున్నాడు.
‘‘నాన్నా ఒక్క పదివేలు వెయ్యవా ఎకౌంట్‌లో. మెటీరియల్ కొనాలి’’ అంటే, అలాగే వేస్తూ వచ్చాడు. రిటైర్ అయిన ఆయనకి డిపాజిట్‌లు బ్రేక్ చేస్తుంటే ఇల్లు గడవడం కష్టంగా ఉంది!హారికకి సినిమా వాళ్ళు డబ్బులు ఇవ్వడమూ, ఆమె తండ్రికి తిరిగి ఇవ్వడమూ ఏడాదిన్నర గడిచినా కనపడలేదు.ఓ పెద్ద సినిమాకి పని చేసింది. పాతకాలపు పీరియాడికల్ మూవీ, ట్రామ్‌లూ, అప్పటి ఇళ్ళూ, వీధులూ....అన్నీ కష్టపడి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఆర్ట్ డైరెక్టర్‌కి తనే సూచనలు ఇచ్చి మరీ చేసి, సినిమా రిలీజ్‌కు ముందు ‘‘సార్! నా పేరువేస్తే క్రెడిట్స్‌లో...ఈ పడ్డ శ్రమంతా మరచిపోతాను’’ అంది.‘‘అలాగేనమ్మా, నీ ఐడెంటీ రిజిస్ట్రేషన్ కార్డ్ చూపించు’’ అన్నాడాయన. ఆమె తెల్లమొహం వేసి ‘‘లేదు సార్, కార్డ్‌కి రెండున్నర లక్షలు అన్నారు. ఎక్కడ నుండి తీసుకురానూ?’’ అంది.