‘‘అమ్మా, రేపు మనింటికి ఓ గెస్ట్ రాబోతున్నాడు. నువ్వు, నాన్న పార్టీలోవుండగా అతనితో చాలా క్లోజ్‌గా వుండేవాళ్లని చెప్పాడు. ఇప్పుడతను రాష్ట్రస్థాయి నాయకుడు, జాతీయస్థాయి కార్మిక నాయకుడు’’ అన్నాడు రాత్రి భోజనాల సమయంలో కరుణాకర్. ‘‘అప్పుడు మాకందరూ ఒక్కలాగే అనిపించేవారు. మాకెవరూ క్లోజ్ కాదు, దూరం కాదు. వచ్చేదెవరు? ఎన్ని రోజులుంటున్నాడు?’’ అన్నాను.
‘‘సుధాకర్ కందిమిట్ట. మనతో పది రోజులుంటాడు. నీతో మాట్లాడ్డమే ముఖ్యమట. ముఖ్యంగా పాత రోజుల్ని గుర్తుచేసుకోడానికి. తనేదో బుక్ రాస్తున్నాడట. అందుకని అమెరికా వస్తున్నాడు. ఉదయాన్నే ఎయిర్ పోర్ట్‌కు వెళ్లి తీసుకువస్తాను.’’‘‘ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా! మేం కలిసి పని చేసింది ఒక ఏడాదే. ఇంత దూరం ఖర్చులు పెట్టుకొని, పనులు మానుకొని రావడమెందుకు?’’ అన్నాను.‘‘మనింటికి మాత్రమే కాదులే. ఇంకా కొందర్ని కలవాలనుకుంటున్నాడు. నెల రోజులు ఇక్కడే తిరగాలనుకుంటున్నాడు.’’‘‘అలాగా’’.‘‘నీకు చెప్పలేదు కానీ, ఏడాది క్రితం హైదరాబాద్ వెళ్లినప్పుడు బుక్ ఎగ్జిబిషన్‌లో కలిశాడు. అమ్మ ఎలా వుందంటూ పలకరించాడు. నా చేతిలో బుక్స్ చూసి, ‘మంచి సాహిత్యం చదువుతున్నావే’ అని మెచ్చుకున్నాడు.
ఫేస్ బుక్ ద్వారా బాగానే మాట్లాడుకుంటున్నాం. ‘అమ్మా నాన్నల దారిలోనే వున్నావు. గర్వంగా వుంద’ని అంటూ వుంటాడు’’ అన్నాడు కాస్త సిగ్గుపడిపోతూ కరుణాకర్.‘‘పొగడ్తలకు తబ్బిబ్బయి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నావు. అంతేనా?’’ అన్నాను నవ్వుతూ.‘‘ఆయన చాలా ప్రేమగా మాట్లాడుతాడు. నిజంగానే, మీరు మళ్లీ ఆ రోజుల గురించి మాట్లాడుకుంటుంటే వినాలనిపించింది. నా స్వార్థం కూడా వుంది’’ అన్నాడు బింకంగా.
మౌనంగా మా మాటలు వింటున్న ఎనిమిదేళ్ళ కాంతి ‘‘నానమ్మ ఫ్రెండ్ వస్తున్నాడా, అయితే నాకూ ఫ్రెండే. చాలా కథలు చెప్పుకోవచ్చు ... చాలా బొమ్మలు వేసుకోవచ్చు’’ అంది.‘‘అవన్నీ నీ హోం వర్క్ చేసుకొని, యాక్టివిటీస్‌కు వెళ్లి వచ్చాకే’’ అని గుర్తు చేసింది పాప వాళ్లమ్మ సంఘమిత్ర.‘‘అయితే కాంతి గది గెస్ట్‌కు ఇవ్వాలి కదా. ఈ రోజే కాంతి టాయిస్, బుక్స్, క్లోత్స్ నా బెడ్ రూంలోకి మారుస్తాను’’ అన్నాను.‘‘టెన్ డేస్ నేను నానమ్మ గదిలో పడుకుంటాను... చాలా కథలు చెప్పించు కుంటాను’’ అని సంబరపడిపోయింది కాంతి.