నేను హైస్కూలులో చదువుతున్న రోజులు.కడుపునిండా తినడం, కంటినిండా నిద్రపోవడం, పరీక్షలముందు లేదా స్లిప్ టెస్ట్‌లముందే గట్టిగా చదవడం, ఉన్న నలుగురు ఫ్రెండ్స్ ముందు మాకు వచ్చిన మార్కుల గరించి కలపోసుకోవడం, చర్చించుకోవడం, ఎక్కువమార్కులు వచ్చినవాడిని వెటకారాలతో నిందించడం, తక్కువ మార్కులొస్తే పేపర్‌దిద్దిన వాడిని తిట్టడం, లేకపోతే నిక్‌నేమ్స్ పెట్టడం ఇవే తెలుసు మాకు.
మంచీ చెడ్డా ఏమిటనే విచక్షణా జ్ఞానమే లేదు. ఐతే ఇష్టమైన విషయం ఏదైనా ఉంటే, దానిగురించి పూర్తిగా తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేకపోలేదుగానీ అంతవివరంగా మాకు చెప్పేదెవరు?‘‘లేలే...లేచి ముఖం కడుక్కో, మెయిల్‌కి టైమవుతోంది. సీతక్క ఈ రోజు మెయిల్‌లో వస్తానని ఉత్తరం రాసింది కదూ! మంచం కనిపిస్తే కౌగిలించేసుకుంటావ్, లే పన్నెండు కావస్తోంది లే’’మా అమ్మ గదిలో ఏదో సర్దుతూ నా వైపు చూస్తూ పెట్టిన ఆ కేకలకి నాకు తెలివి వచ్చేసింది. ఆ రోజుల్లో కలకత్తా మెయిల్ అనకాపల్లికి సరిగ్గా మధ్యాహ్నం పన్నెండుగంటలకల్లా వచ్చేసేది.మంచంమీద నుండి గబుక్కున లేచాను.అవును సీతక్క ఈరోజు కలకత్తా నుండి వస్తోంది. సీతక్కంటే నాకు చాలా ఇష్టం.‘‘అమ్మో! నువ్వు అప్పుడే తయారైపోయావే!’’ మా అమ్మను చూసి గావుకేకపెట్టాను.
తయారవ్వనా! ట్రైన్ వచ్చే టైమవుతోంది కదా! తొందరగా ముఖం కడుక్కో. చొక్కా మార్చితే చాలు, ఫ్యాంట్ బాగానే ఉంది’’.మరో ఐదు నిముషాల్లో చొక్కా మార్చి, తల దువ్వుకుని తయారైపోయాను. స్టేషన్ మా ఇంటికి దగ్గరే! సీతక్కగురించి మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉంటే, మా అమ్మా నేనూ స్టేషన్‌వైపు అడుగులు వేశాం.స్టేషన్ అంతా ప్రయాణీకులతో హడావుడిగా ఉంది. మాలాగే సీతక్కకోసం, మరికొంతమంది చుట్టాలూ, స్నేహితులూ ఫ్లాట్‌ఫాంమీద ఉన్నారు. అప్పటిలో ఇప్పటిలా రిక్షాలూ, ఆటోలు లేవుకాబట్టి చేతిలో లగేజీ ఉంటే ఒంటెద్దుబండ్లే గతి. సీతక్క తనతో ఏదన్నా సామాను తెస్తుందని కాబోలు బండిని కూడా మాట్లాడేశారు ఆమె స్నేహితులు.