పేపరు కుర్రాడు అప్పుడే ఇచ్చిన వీక్లీ పుచ్చుకుని ఇల్లంతా వెతికేస్తోంది సులోచన. ఎక్కడా కని పించలేదు. కనిపించడానికి కళ్ళజోడుంటేగా? అసలు కళ్ళజోడే కనిపించకపోతే ఎలా?‘‘ఏమిటే సులోచనా వెతుకుతున్నావు? బట్టలు, పేపర్లు, పుస్తకాలన్నీ కిందపడేశావు. ఏం కనబడలేదు?’’ అడిగింది అత్తగారు.

పదకొండేళ్ళ సుపుత్రుడు మధు, ‘‘ఏం పోయింది మమ్మీ? నా టేబుల్‌ మీద బుక్సన్నీ పడేశావు?’’‘‘ఏం కనబడలేదమ్మా? నా బుక్‌షెల్ఫ్‌లో పుస్తకాలన్నీ కూడా కింద పడేసావు? ఇప్పుడు స్కూలుకి తీసికెళ్ళాల్సిన బుక్సు కూడా కనిపించటల్లేదు. ఏం పోయింది?’’ అడిగింది కూతురు సుధ.‘‘నా కళ్ళజోడే. కొంచెం వెతికిపెట్టండి. వెంటనే వెతికిచ్చిన వాళ్ళకి మంచి బహుమతిస్తా. అర్జంటుగా ఇవ్వాలి. ఉదయమే బ్రష్‌ చేసుకునొచ్చి కాఫీ కలపబోతుంటే జయలక్ష్మి ఆంటీ ఫోన్‌ చేసి, ‘సులోచనా! వీక్లీలో నీ కథ పడింది’ అంటూ కంగ్రాట్స్‌ చెప్పింది’’‘‘నిన్న టీ.వీ. మీద చూశాను మమ్మీ’’ అంటూ టీ.వీ మీదున్న కళ్ళజోడు ఇచ్చి, ‘‘వెతికిచ్చాగా? ఏదీ నా బహుమతి?’’ అన్నాడు.

గమ్మున ఆ కళ్ళజోడు కళ్ళకి పెట్టుకుని తన కథ చదువుదామని వీక్లీ తిరగేస్తుంటే అక్షరాలు ఒక్కటీ కనిపించలేదు. ‘‘ఒరేయ్‌! ఈ కళ్ళజోడు నాది కాదురా, నానమ్మది’’.‘‘ఒరేయ్‌! నా కళ్ళజోడు తియ్యకురో. ఏదీ ఇలాగియ్యి. ఎక్కడ పెట్టానో మరచిపోయి దీనికోసమే వెతుక్కుంటున్నాను’’.‘ఐతే నానమ్మా! నీ కళ్ళజోడు వెతికిచ్చాగా? నాకు బహుమతియ్యి’’‘‘ఏడిశావులే వెర్రినాగన్నా! నిన్నేమన్నా కళ్ళజోడు వెతికిమ్మన్నానా? నేనక్కడ పెట్టుకున్న కళ్ళజోడు తీసి నాకిచ్చి నన్నే బహుమతి అడుగుతావా?’’‘‘ఐనా అమ్మా, నానమ్మా! మొహానికంత చారెడేసి కళ్ళేసుకుని కనబడక పోవడమేమిటి?’’‘‘సరేలే.

అమ్మమ్మ కళ్ళు అంటే, మా అమ్మ కళ్ళు మాకన్నా పెద్దవి, మా మామయ్యలు, ‘దీనికి ఒళ్ళంతా కళ్ళే’ అనేవాళ్ళు. ఎప్పుడన్నా ఉత్తరాలొచ్చినప్పుడు, కళ్ళజోడు కనబడకపోతే, అంతపెద్ద కళ్ళను చికిలించి ఆ ఉత్తరం చదివేది. అప్పుడు నేనూ నీకులాగే అనుకునేదాన్ని, అంతపెద్ద కళ్ళుంటే కనబడక పోవడమేమిటని. ఆ బాధేమిటో నాకు ఇప్పుడు తెలిసింది. రేపు పెద్దయ్యాక నీకూ కళ్ళజోడొచ్చినప్పుడు ఆ బాధేమిటో తెలుస్తుంది లేరా’’ అంది సులోచన కొడుకు మధుతో.