ఈ మధ్య ఆ పిల్లల్ని గమనిస్తోంది టీచర్. నైన్త్, టెన్త్ ఆడపిల్లలు తరచు స్కూలు మానేస్తున్నారు. జ్వరపడుతున్నారు. స్కూలుకు వచ్చినా, నీరసంగా ఉంటున్నారు. ఇదివరకటి చలాకీతనం వాళ్ళల్లో లేదు. దిగాలుగా ఉంటూ అస్తమానూ గుసగుసలాడుకుంటున్నారు. ఆమెకు ఏమిటో అర్థం కావడం లేదు. కానీ ఎక్కడో ఏదో సందేహం..ఆమె మనసు కీడు శంకిస్తోంది. అసలు ఏం జరిగింది?.....
తొమ్మిదో తరగతి గదిలోకి ప్రవేశించింది రాగిణి టీచర్.పిల్లలందరూ లేచి ఆమెను విష్ చేశారు.క్లాసులోకి వెళ్ళగానే తన చేతిలో ఉన్న చార్టు తీసి బ్లాక్‌బోర్డ్‌పైన ఉన్న మేకుకు తగిలించింది.చార్టు వంక ఆశ్చర్యంగా, ఒకింత వింతగా, మరికొంత సందేహంగా చూస్తున్న విద్యార్థులవంక చూసి, ‘‘అందరూ కూర్చోండి. చార్టులో ఉన్న చిత్రాలు మీకు ఆసక్తి కలిగిస్తున్నాయి కదూ. ఇది ఐదో చాప్టర్ ‘మానవ ప్రత్యుత్పత్తి’. ఈ చాప్టర్‌లో మొత్తం ఆరు పాఠాలు ఉన్నాయి. రెండురోజులకు ఒకపాఠం చొప్పున మనం పూర్తిచెయ్యాలి. తర్వాతనుంచి ఆరునెలల పరీక్షలకు రివిజన్ ఉంటుంది’’ అని పిల్లలందరిని ఒకసారి కలయచూసింది రాగిణి టీచర్.
చార్టు వంక, రాగిణి టీచర్ వంక మార్చిమార్చి ఆసక్తిగా చూడసాగారు పిల్లలంతా.అది ఊళ్ళో ఓ మోస్తరు పేరుమోసిన ప్రైవేట్ ఉన్నత పాఠశాల. రాగిణి అక్కడ సైన్స్ టీచర్‌గాచేరి మూడు నెలలైంది. తన బోధనానైపుణ్యం, వాక్చాతుర్యంతో పాటు పిల్లలను సొంత బిడ్డల్లాగా దగ్గరకు తీసుకుని ఆదరించేది. అలా అతి తక్కువ సమయంలోనే మంచి టీచర్‌గా పేరు తెచ్చుకుంది రాగిణి. మిగతా టీచర్ల క్లాసులు సరిగా విన్నా వినకున్నా రాగిణి టీచర్ క్లాస్ అంటే మాత్రం పిల్లలు చెవికోసుకునేవారు. మిగతా టీచర్లకు ఇది కాస్త కంటగింపుగా ఉండేది.తొమ్మిదో తరగతి అంటే ఎదిగీ ఎదగని వయసు. అప్పుడే పూర్వ కౌమారదశలోకి అడుగుపెడుతున్నవాళ్ళు ఆ పిల్లలంతా. ‘‘ద్వితీయలైంగికవృద్ధి, ఋతుచక్రం, హార్మోనులు వంటి సున్నితమైన అంశాల్ని వాళ్ళకి పాఠాలుగా చెప్పడం టీచర్లకు కత్తిమీద సాములాంటిదే. పాఠం మొదలుపెట్టీపెట్టకముందే పిల్లలలో బోలెడన్ని సందేహాలు, క్లాసులో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉన్నారు. వాళ్ళు అడిగిన సందేహాలకు సమాధానాలు చెబుతూనే ఎంతో చాకచక్యంగా, పిల్లల మనసులలో ఎటువంటి వికారాలు తలెత్తకుండా పాఠం అర్థం అయ్యేలా చెబుతోంది రాగిణి టీచర్. అంతలో బెల్ మోగింది. ఐనా కదలకుండా మంత్రముగ్ధులై వినసాగారు పిల్లలు. సోషల్ టీచర్ మాధవ్ ఆ క్లాసు గుమ్మం దగ్గరకువచ్చి, ‘‘రాగిణిగారూ, మాక్కూడా పిల్లలకు పాఠంచెప్పే అవకాశం ఇవ్వండి’’ అన్నారు నవ్వుతూ. రాగిణిసహా పిల్లలు అందరూ ఆ పాఠంలోంచి బయటకు వచ్చారు. నవ్వుతూ మాధవ్ టీచర్‌కి సారీచెప్పి, స్టాఫ్ రూమ్‌లోకి వెళ్ళింది రాగిణి టీచర్.