వాళ్ళిద్దరిమధ్యా వారం రోజుల పరిచయం. స్వల్ప సమయంలోనే మంచి మిత్రులయ్యారిద్దరూ. రోజూ ఉదయమే ఆ మర్రిచెట్టుదగ్గర సేదదీరి కాసేపు కబుర్లు చెప్పుకుని వెళతారు. అతడు వెళ్ళిపోతుంటే ఆయన దిగాలు పడ్డాడు. కనీసం కథలో అయినా తన గురించి సానుకూలంగా రాయమని ఆయన అతడిని అభ్యర్థించాడు. మళ్ళీ మనం కలుసుకుందాం అని ఒక తేదీ నిర్ణయించుకున్నారిద్దరూ. మరి వాళ్ళు తిరిగి కలుసుకున్నారా? అసలు వాళ్ళిద్దరినీ కలిపిందేమిటి?..
ప్రాచీన, ఆర్వాచీనం సమ్మిళితం పూనానగరం.కొన్నిరోడ్లపక్కన విశాలంగా విస్తరించి ఉన్న మర్రిచెట్లూ, పాతకాలంనాటి బంగళాలూ, కొన్నిరోడ్లపక్కన అందమైన చిన్నచిన్న అవెన్యూచెట్లూ, అధునాతనమైన భవన సముదాయాలూ, పాతకొత్తల మేలు కలయికలా దర్శనమిస్తాయి.ప్రిన్స్ ఆఫ్ వేల్స్ స్ట్రీట్ బంగళాలో ఉన్న మిలిటరీ హాస్పిటల్‌లో అన్నయ్య కమాండెంట్.
నేను పూనా వచ్చి వారం రోజులైంది.‘‘ఎల్లుండే కాబోలు మీ ప్రయాణం’’ నా పక్కనే కూర్చుంటూ అన్నాడతను. పరాయి రాష్ట్రంలో ఇద్దరం తెలుగువాళ్ళమే. వారంరోజుల పరిచయమే. స్వల్పకాలంలోనే మా మధ్య బాగా సఖ్యత ఏర్పడింది. మార్నింగ్ వాక్ ముగించుకుని నేను కంటోన్మెంమెంట్‌వైపునుండి, అతను సి.టి.సివైపునుండి వచ్చి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ స్ట్రీట్ కూడలిలో ఓ పెద్ద మర్రిచెట్టుక్రింద చప్టామీద ఓ అరగంట విశ్రమించడం, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడం వారం రోజులుగా మాకు అలవాటైంది.అతనిమాటల్లో ఓరకం నైరాశ్యపుజీర ధ్వనించడం నాలుగురోజులుగా గమనిస్తున్నాను.‘‘అవునండీ. మరో నాలుగు రోజులుండమంటున్నారు అన్నయ్యా, వదిన. కానీ సెలవు లేదు. వెళ్ళక తప్పడంలేదు’’.
‘‘ఈ మర్రిచెట్టు ఒక మంచి మిత్రుణ్ణి ప్రసాదించింది నాకు’’ అన్నాడు నావైపు అభిమానంగా చూస్తూ.‘‘హ్హహ్హ! నేనూ అలాగే అనుకుంటున్నాను. అయితే, ఈ వటవృక్షానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం! వచ్చే నెలాఖరుకి మళ్ళీ ఇక్కడకు వస్తున్నాను. మళ్ళీ కలుసుకునే అవకాశం త్వరలోనే మనకు కలుగబోతోంది’’ అన్నాను అతన్ని మంచి మూడ్‌లోకి తేవాలని.‘‘చక్కటి తారురోడ్డుమీదనుంచి కారులో వందమైళ్ళ ప్రయాణం స్వల్పదూరమే అనిపిస్తుంది! గతుకులరోడ్డుమీద తుప్పుపట్టిన చచ్చుకారులో ప్రయాణం పాతికమైళ్ళదైనా సుదూరమనిపిస్తుంది. మీకు రెండునెలలకాలం స్వల్పమైనదే, నాకది సుదీర్ఘమైనది!’’ వేదాంతిలా అన్నాడు.‘‘మీరు మరీ సెన్సిటివ్ అయిపోతున్నారు. మన ఉభయులకూ ఒకేవిధంగా గోచరమయ్యేది మన ఎదటనే ఉంది. ఈ మర్రిచెట్టుని చూడండి. ఎంత విశాలంగా విస్తరించి ఉందో! నాకూ, మీకూ ఇద్దరికీ విశాలమైనదిగానే కనిపిస్తోంది కదా’’ ఆయనన్న మాటల్ని తేలికచేస్తూ అన్నాను.