ప్రొద్దున్నే ఫోన్‌ సమాచారం తెలిసినప్పటినుంచీ సూర్యంగురించే నా హృదయం ఆవేదనతో నిండిపోయింది. సూర్యాన్ని చూడటానికి, డ్రైవర్‌ని తీసుకుని వెంటనే కారులో బయలుదేరాను. నా స్నేహితుడు సూర్యాన్ని తలచుకుంటే, కలల వెలుగు నింపుకున్న నా కళ్ళతో చెక్కు చెదరని ఓ నవ్వు ముఖమే మనసులో ప్రత్యక్షమవుతుంది.

‘‘కలలు కనాలిరా’’ అని ఆరు దశాబ్దాల క్రితమే వాడన్న మాట ఎప్పటికీ మరచిపోలేను. అబ్దుల్‌ కలాంగారు అన్నారా? లేక సూర్యమా? ఈ మాట ఎవరు ముందన్నారు? ఎవరు వెనుకన్నారు? అలాంటి ఆలోచనల గందరగోళం అనవసరంగానీ, మా సూర్యం కూడా ఆ మాటన్నాడనేది నిజం. అప్పుడే కాదు ఎన్నో సంవత్సరాల తరువాత రెండేళ్ళక్రితం మా స్కూల్‌ పూర్వవిద్యార్థుల సమ్మేళనం (అలుమ్ని) సందర్భంగా కలిసినప్పుడు, డెబ్భైఏళ్ళు నిండిన ఆ వయసులో కూడా సూర్యం తన కలల గురించే మాట్లాడాడు. అలాగని వాడు కన్నకలలన్నీ తీరాయని కాదు. వాడికి కష్టాలు లేవనీ కాదు. కష్టం ఎదురైనా, కల విఫలమైనా దృఢ చిత్తంతో తిరిగి కలలు కనేవాడి మనస్తత్వం అర్థం కాని ఓ అద్భుతం.

ఎంతటి క్లిష్ట పరిస్థితిలో కూడా ‘‘కలలు కనాలి రా’’ అనేవాడు. ఇప్పటి పరిస్థితిలో కూడా వాడు ఆ మాటే అనగలడా? ఓ ప్రక్క స్నేహితుడిగా వాడి పరిస్థితి మీద సానుభూతి ఉన్నా ఎక్కడో ఆసక్తి కూడా ఉంది. ఇలాంటి ఒకరకమైన ఉత్సుకతతో ఉండే సందర్భం కాదు ఇది అని తెలిసినా, మానవ నైజం కావచ్చు, ఎంత వద్దనుకున్నా మనసు ఆ ఆలోచన చుట్టూనే తిరుగుతోంది. చెరువులో ఈతలు, కోతి కొమ్మచ్చులు, గోలీలాటలతో కాస్త సౌకర్యాలు ఉన్న పల్లెటూరిలో అందంగా సాగిపోతున్న బాల్యంలో ఏర్పడ్డ స్నేహం మాది. సూర్యంతో నా స్నేహం చాలా గాఢమైనది. ఒకే వీధి, ఒకే బడి, ఒకే ప్రాణం కూడా మాది.