పెళపెళమంటూ కొమ్మ విరిగి నేలబడిన చప్పుడు. తలొంచుకుని జొన్నలు కడుగుతున్న సరిత ఉలిక్కిపడి చప్పుడైన వైపు పరుగుపెట్టింది.కొబ్బరాకులు చీల్చి ఈనెలను కట్టకడుతున్న భూదేవమ్మ విరిగి పడిన కొమ్మను చూసి ‘‘అనుకుంటూనేవున్నా... కాయల బరువు యెక్కువై కొమ్మ యిరిగిపోతదని’’ అంటూ లేవబోయి మళ్లీ కూలబడింది. ఏడు పదులు దాటిన ముసల్ది కాలు చేయీ తీసుకుని మళ్లీ లేవబోయే సరికి యింకో కొమ్మ విరిగిపడింది.మనుమడి పెళ్లాం సరిత ‘‘అత్తోయ్.. నువ్వు చెట్టెందుకు యెక్కావ్? దిగు, దిగిరా.. ముందు. ఆడ్నించి పడితే యేమైనా వుందా?’’ కేకలు పెట్టింది. భూదేవమ్మ సత్తువకొద్ది పరుగెత్తు కొచ్చి పైకి చూసింది. కోడలు మీనమ్మ చెట్టు పంగలపై కాళ్ళుంచి నిచ్చెన ఎక్కుతున్నట్టు యింకో పంగ కోసం వెతుకుతోంది.‘‘అమ్మే.. మీనమ్మా.. ఏడికే అట్టా ఆకాశంలోకి యెక్కతావున్నావ్, కొమ్మలు యిరిగిపడింది తెలియడంలా? ఆడనుంచి పడితే నడుములు యిరుగతాయ్, కిందకి దిగమ్మా’’ బతిమాలింది.మీనమ్మ దిగినవెంటనే అమ్మమ్మ, మనవరాలు .. యిద్దరూ చెరో చేయి పట్టుకుని సావిడిగదిలో మంచంపై కూర్చోబెట్టారు.బుద్ధిగా పడుకుంది మీనమ్మ. ‘అమ్మయ్య! గట్టి వాన కురిసి తెరిపిన పడ్డట్టుంది పేణానికి’ అనుకుంది భూదేవమ్మ.‘‘అమ్మమ్మా! నీతో అమ్మ మాట్టాడుద్దంట..’’ ఫోన్ తీసుకొచ్చి యిచ్చింది సరిత.‘‘ఎట్టుంది నీ కోడలికి’’ అడిగింది కూతురు.‘‘ఏం చెప్పను లేవే మా యెతలు. ఎవురూ ఆర్చేది తీర్చేది కాకపోయే. పూటకొక గండం. కొంచెంసేపు యేమారినా యేం తంటాలు తెచ్చి పెట్టుదో నన్న భయమైపోయే. అణుకువ గల బిడ్డ.. దానికి యెందుకు యిట్టా పిచ్చి పట్టిందో, కాస్తయినా నెమ్మళ పడితే జొన్నాడో, వేదాద్రికో పోయి మూడు నిద్దర్లయినా చేపిచ్చుకుని రావాలనుకుంటున్నా.’’‘‘అన్న యేమంటున్నాడు? నేను ఫోన్ చేసి మాట్టాడితే దానికి పిచ్చి లేదు యేం లేదు అన్నీ యేసాలు అన్నాడు.’’ఆ మాట వినగానే భూదేవమ్మకు కోపం తన్నుకొచ్చింది.‘‘ఏసాలు ఆడికి చేతైనట్టు పెపంచంలో యెవురికైనా చేతోచ్చా. సీకటి పడే టయానికి యేనాడైనా యింటికాడ పడివుండాడా.. ఎప్పుడూ పరాయి కొంపల్లోనూ మంచె కాడా తెల్లారిపోయే! దాని యేడుపంతా పీల్చుకొని పీల్చుకొని గట్టిబడిపోయిన బూరగ దూది దిండు పాటి అయినా మనం అర్థం చేసు కోవాల. సాటి ఆడదాన్ని అర్థం చేసుకోకుంటే యెట్టా, నీకు వచ్చినయి యింటి ముందు తాడిచెట్టుకు వచ్చినయి యేళ్ళు. ఇప్పుడంటే అన్నావ్ గానీ ఇంకోతూరి ఆ మాటంటే అన్నోళ్ళు యెవురైనా చెప్పుతో కొడతా.’’
*****************************************************