‘‘జంతువు నుంచే మనిసి పుట్టేడు బ్రమ్మం!’’ అద్దంలో నా ప్రతిబింబం చూసుకుంటూ అన్నాను.కోతి మొహం పెట్టి కుక్కలా చూశాడు పి.ఏ బ్రహ్మం.‘‘నీకు తెలీదుగానీ ఇదొరకు జంతువులానే బతికేన్రా బ్రమ్మం. సదువూ సట్టుబండలూ లేవు. గేదెల్ని మేపడానికి తోలుకెళ్ళి మేకలకోసం సూసేవోణ్ణి. అవి కన్పిత్తేసాలు పొదుగు పిండుకుని పాలు తాగేసేవోణ్ణి. ఆ పైన సారా కాశాను. సారాకొట్టు నడిపాను. రౌడీనయ్యాను. జైలుకూడు తిన్నాను. పుల్లారావుగోరి నమ్మిన బంటునయ్యాను. ఆరి పున్నాన సిల్కుచొక్కా తొడిగాను. చొక్కారంగులూ మార్సాను. కడకి అరినే ఓడించేను. నిన్నరాత్రే అధికార పార్టీలోకి జంప్ సేశాను. ఇదిగో తెల్లారి మంత్రిని అయిపోతన్నాను సూడు, సిత్రవంటే ఇదే ఇదే..’’
‘‘అవతల ప్రమాణ స్వీకారానికి టైమవుతోందండీ’’‘‘అందుకేగదా ఈ వేసం! ఈ పాట్లూ!’’ రకరకాల రంగురంగుల పంచెలూ, జుబ్బాలూ, షేర్వాణీలూ, బుష్కోట్లూ ఒంటి మీదేసుకుని చూసుకుంటూ అన్నాను.కడకి ఒకటి బాగా నచ్చింది. ‘‘గంగిరెద్దులా ఉన్నానేంటి బ్రమ్మం!’’‘‘లేదు లేదు ఒక యాంగిల్లో నెహ్రూగార్లా ఉన్నారంటే నమ్మండి’’పి.ఏ మాటలకి మురిసిపోతూ బయల్దేరాను.మా ఇంటిది తల కదల్చకుండా హారితిచ్చింది. మెడపట్టి కాదు, మెడని కదలనివ్వనన్ని నగలు అమ్మోర్లా దిగేసుకుంటుంది!ముందూవెనకా పోలీసోళ్ళు వస్తోంటే ఎర్రబుగ్గ కారు ముందు వెళ్తావుంటే రయ్ రయ్మని వెళ్ళాను.
పాతరోజుల్లో పోలీసులు తరుముతోంటే అందకుండా పారిపోయేవాణ్ణి. ఇప్పుడు వాళ్ళే నాకు కాపలా కాసేస్తున్నారు. ఇదేమి చిత్రంగాదు నా వైభోగం అలాంటిది మరీ!గవర్నరుగారు చెప్పిన ముక్కలే అప్పగించేసి ‘అమ్మయ్య’ అని వెన్ను తట్టుకున్నాను. ‘‘నీకు పశువుల శాఖ ఇస్తున్నాను’’ అన్నారు ముఖ్యమంత్రి.‘‘భేషో. సిన్నప్పుడు పశువుల్ని మేపేను. ఎలాంటి తిండి పెట్టి ఎలాంటి ఇండీసన్లు పొడిత్తే ఎక్కువ పాలిత్తాయో జైల్లో నేర్చుకున్నాను’’.