నేను నరసింహం గురించి చెప్పేముందు నా గురించి నేను చెప్పుకోవాలి.***ఈ లోకంలో అందరూ కథకులే. చాలామంది పక్కింటోల్ల కతలూ, ఎదురింటోల్ల కతలూ చెబుతారు కొంతమంది మాత్రమే వాటిని రాస్తారు. దానికి ముందు చేయాల్సింది ఎవడి కథ వాడు చెప్పటం. ఇది నా కథ అని కొంతమంది చెప్పిమరీ రాయించుకుంటారు. అందులో ‘అతి’ ఉండొచ్చు. స్వయంగా రాసుకునేవాళ్ల కథల్లో కూడా అంతే అతి ఉండవచ్చు. నువ్వు ఎదుటివాడి గురించి ఎంత ఎటకారంగా రాస్తే నీ గురించి కూడా అంతే ఎటకారంగా రాసుకోవాల. నువ్వు ఎవర్నన్నా ‘ఎదవ’ అని రాస్తే నువ్వు కూడా ‘ఎదవన్నర ఎదవ’ నని ఒప్పుకోవాల. ఇక్కడ ఆపి నా కథలోకి ఎల్లిపోతాను.
‘‘నీకు అన్నీ మీ తాత పోలికలేరా’’ అనేది మా అమ్మ.ఆయన నేను పుట్టకమందే చచ్చిపోయాడు. అనగా, ఆయన నేనుగా మళ్లీ పుట్టానని మా తల్లి భావం కావచ్చు.మా అమ్మది ఎనకటికాలం భాష. ఇప్పుడైతే ‘జీన్స్’, ‘హెరిడిటరీ’ లాంటి పదాలు చెలామణిలోకి వచ్చేయి. మా తాతపేరు ‘వెంకయ్య’. మా నాన్న నాకు ఆ పేరు పెట్టలేదు. నాకో వీరదేశభక్తుడి పేరెట్టాడు.ఆయనకి అంటే నా పేరున్న దేశభక్తుడికి తెల్లోల్లంటే కసి. వాళ్లు కనిపిస్తే తుపాకి పుచ్చుకుని కాల్చేయాలన్నంత కోపం. అలానే చేసేడు. తర్వాత తెల్లోలు ఆయన్ని కాల్చారు.కోపం, కసి మనకి మాత్రమే ఉండే లక్షణాలు కాదు.
మా వెంకయ్యతాత మా నాన్నకి బాబాయ్ అవుతాడు. నన్ను మా నాన్న కూడా గమనించి ఉంటాడు. ఆ పేరు నాకెందుకు పెట్టలేదు అనుకునేవాడ్ని. అందులోనూ పింగళి వెంకయ్యగారు మన జాతీయజెండాని తయారుచేశారు. ఆయనపేరు చెడగొట్టడం ఎందుకనుకున్నాడో, మా నాయనకిష్టమైన రంగు మనజెండాలో లేదనుకున్నాడో నేను కొత్తజెండా తయారు చేస్తాననుకున్నాడోగానీ, మనకి..అనగా నాకు తెలియదు. చెప్పటానికి మా నాయనాలేడు.