పనీపాటా చేసుకుని బతికేవాడతను. ఎంతకష్టపడినా కడుపునిండా తిండితప్ప ఒక్కవెండినాణెం కూడా ఎవరూ ఇచ్చేవారుకాదు. దాంతో అతడు ఆ గ్రామం వదిలి మరోచోటకెళ్ళాడు. ఒక యజమాని నెలకు 20 వెండినాణేలిస్తాడని తెలుసుకుని అతడింటజేరాడు. కానీ ప్రతిరోజూ అతడి హింస భరించలేక మహా శాంతస్వభావుడైన వ్యక్తిఇంట పనిలో చేరాడు. నెలగడిచాక జీతం తీసుకోబోయే ముందురోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే...
అనగా అనగా ఒక గ్రామంలో సుకాముడు అనేవాడు ఉండేవాడు. అతడు ఆ ఇంటా ఈ ఇంటా పనులు చేసుకుని పొట్ట పొషించుకునేవాడు. ఎవరింట్లో పని చేసినా తిండిపెట్టి పంపించేవారేగానీ, ఎవరూ డబ్బిచ్చేవారు కాదు. డబ్బైతే, నిలవేసుకోవచ్చు. తిండి అయితే ఏ రోజుది ఆ రోజే అరిగిపోతుంది. ఇలా ఎన్నాళ్ళు?కొంతకాలానికి సుకాముడికి ఆ జీవితంమీద విరక్తిపుట్టింది. అతడు గ్రామంవదిలిపెట్టి బాహ్యప్రపంచంలోకి బయలుదేరాడు. ఓ అరణ్యమార్గానపడి ఎంతోదూరం నడిచాడు. అలసిపోయినప్పుడు చెట్లనీడన విశ్రమించేవాడు. దొరికినప్పుడు ఫలాలు ఆరగించేవాడు. అలా ప్రయాణిస్తూ అరణ్యాన్నిదాటుకుని ధర్మవరం అనే గ్రామం చేరుకున్నాడు. ధర్మవరం ఊరుపొలిమేరల్లో సుకాముడికి ఓ ముసలివాడు ఎదురయ్యాడు. అతడాముసలివాడిని పలకరించి తనగురించి చెప్పుకున్నాడు. తాను ఆ గ్రామానికి వచ్చిన పనేమిటో వివరంగా చెప్పాడు.
‘‘అయితే, ప్రసన్నుడి ఇంటికి వెళ్ళు బాబూ! వచ్చినపని తప్పకుండా అవుతుంది’’ అంటూ దారిచూపించాడు ముసలివాడు. సుకాముడు ప్రసన్నుడి ఇల్లు చేరుకుని, తనకు పని కావాలని చెప్పాడు.‘‘నా పొలంలో పాలేరుగా పనిచేస్తావా? నీకు నెలకు పది వెండికాసులు ఇస్తాను’’ అన్నాడు ప్రసన్నుడు.సుకాముడికి ఆ జీతం తక్కువ అనిపించింది. ‘ఆ డబ్బు తన తిండికి మాత్రం సరిపోతుందేమో, అంతే! ఇలాగైతే తను ఎప్పటికి డబ్బు నిలువ వేస్తాడు? ఎప్పటికి గొప్పవాడనిపించుకుంటాడు?’ ‘‘మీరు చెప్పినపని చెప్పినట్లు చేస్తాను. కానీ పది వెండికాసులు చాలవుబాబూ! కనీసం ఇరవైకాసులు ఇప్పించండి’’ అన్నాడు సుకాముడు వినయంగా.
ప్రసన్నుడు అదోలా నవ్వి, ‘‘ఇరవయ్యేంకర్మ! ఆ అనిగ్రహుడివద్దకు వెళ్ళావంటే, నెలకు యాభై వెండికాసులు ఇస్తాడు. నీకు మాత్రం బాగా పనిచేసే ఓర్పు ఉండాలి’’ అన్నాడు.సుకాముడికి తన ఓర్పుమీద బాగా నమ్మకముంది. ఇదివరకు గ్రామంలో వాళ్ళందరూ,- ఓర్పులో కర్ణుడంతటివాడని సుకాముణ్ణి మెచ్చుకునేవారు. అందుకని అతడు అనిగ్రహుడి వద్దకువెళ్ళి నెలకు యాబై వెండికాసులు చొప్పున సంపాదించి త్వరగా గొప్పవాడు కావాలని అనుకున్నాడు. ప్రసన్నుడివద్ద వివరాలు అడిగి తెలుసుకుని అనిగ్రహుడి ఇంటికి వెళ్ళాడు సుకాముడు.